Integrated Organic Farming | సమీకృత సేంద్రియ సాగు విధానం భేష్..

తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Integrated Organic Farming | తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు, సేంద్రియ వ్యవసాయం, సమీకృత పంటల సాగు విధానాలను అవలంభించడం ద్వారా నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు రైతులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆర్మీ మాజీ ఉద్యోగి సీహెచ్ నవీన్ కుమార్ ‘జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్’ పేరిట నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు.

Integrated Organic Farming | వినూత్న ప్రయోగాలకు ప్రశంస..

ఈ సందర్భంగా క్షేత్రంలో అమలు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సమీకృత పంటల సాగు విధానాలను స్వయంగా పరిశీలించి, ఆదర్శ రైతు నవీన్ కుమార్ చేస్తున్న వినూత్న ప్రయోగాలను, కృషిని అభినందించారు. క్షేత్రంలో ఆకు కూరలు, వివిధ రకాల కూరగాయలు, పూల తోటలు, పండ్ల మొక్కలు, గానుగ, ఆయిల్‌పామ్, అరటి, కొబ్బరి సాగుతో పాటు చేపల పెంపకం, నాటుకోళ్ల పెంపకం వంటి విభిన్న వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను కలెక్టర్ పరిశీలించారు.

Integrated Organic Farming | వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం..

వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం చేపడుతూ, వాటి పేడ, మూత్రంతో జీవామృతం తయారు చేసి పంటలకు వినియోగిస్తున్న విధానం, భూగర్భ జలాల పెంపు కోసం వర్షపు నీటి సంరక్షణకు వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటిని గమనించిన కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్మీలో దేశానికి సేవలందించిన అనంతరం వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి, ఆధునిక సాంకేతికతను సేంద్రియ వ్యవసాయంతో సమన్వయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నవీన్ కుమార్‌ను ఇతర రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై శెనగ, మినుములు వంటి పప్పు దినుసు పంటల సాగుకు అవసరమైన విత్తనాలను రాయితీపై అందిస్తున్నామన్నారు.

Integrated Organic Farming | అన్నదాతల్లో చైతన్యం తీసుకురావాలని..

అనంతరం ఆదర్శ రైతు నవీన్ కుమార్ తన వ్యవసాయ అనుభవాలను, సేంద్రియ సమీకృత వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలను కలెక్టర్‌కు వివరించారు. నవీన్ కుమార్ మాతృమూర్తి పుష్ప సైతం సేంద్రియ సాగులో భాగస్వామ్యం అవుతూ ఎంతో అవగాహన కలిగి ఉండడంపై కలెక్టర్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ తరహా వ్యవసాయ పద్ధతులపై ఇతర రైతులకు కూడా అవగాహన కల్పించేందుకు వారిని ఇక్కడికి క్షేత్ర సందర్శనకు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. నవీన్ కుమార్, అతని కుటుంబ సభ్యులు వారి అనుభవాలను ఇతర రైతులతో పంచుకుంటూ, ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయంపై తోటి అన్నదాతల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. తక్కువ నీటి వినియోగం, సేంద్రియ సాగు, సమీకృత వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణపై రైతులకు ఆదర్శంగా నిలిచేలా జై జవాన్ ఆగ్రో ఫార్మింగ్ క్షేత్రం ఉందని, జిల్లాలో ఇప్పటివరకు తాను జరిపిన క్షేత్ర సందర్శనలో ఇది తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో విజయ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహశీల్దార్ దత్తాద్రి, రైతులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bikkunur Bus Accident | లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. 25 మందికి పైగా గాయాలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *