అక్షరటుడే, వెబ్‌డెస్క్: MPSC Paper Leak | మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ కేసులో తాత్కాలిక మెరిట్ జాబితాలో ఏడో స్థానంలో నిలిచిన రుతుజా పాటిల్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు నందుర్బార్లో అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో ఈ కేసులో పోలీసుల అదుపులోకి తీసుకున్న నిందితుల సంఖ్య ఏడుకు చేరింది.
MPSC Paper Leak | అనుమానం రాకుండా వ్యూహం..
పరీక్షకు ముందే లీకైన ప్రశ్నపత్రం రుతుజా పాటిల్‌కు చేరినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పరీక్షలో ఆమెపై అనుమానం రాకుండా ఉండేందుకు ముందస్తు వ్యూహాన్ని అనుసరించినట్లు వెల్లడించారు.
ప్రశ్నపత్రంలో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా 10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఇవ్వాలని ఆమెకు సూచించినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. రుతుజా పాటిల్‌ను కోర్టులో హాజరుపరిచిన అనంతరం మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఆమెను తమ కస్టడీలోకి తీసుకున్నారు.
MPSC Paper Leak | మార్చిలో పరీక్ష..
డ్రగ్ ఇన్స్పెక్టర్ స్క్రీనింగ్ పరీక్షను MPSC మార్చి 22న మహారాష్ట్రలోని ఆరు డివిజనల్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించింది. జూన్ 12న ఫలితాలు విడుదల కాగా, మొత్తం 506 మంది అభ్యర్థులు తదుపరి దశైన ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. జూలైలో ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా పూర్తయింది.
Fake Doctors Medchal | నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. ఐదుగురు నకిలీ వైద్యుల పట్టివేత!
అయితే పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ జూలై 22 నుంచి 26 మధ్య అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందాయి. లీకైన ప్రశ్నపత్రాలు సోషల్ మీడియా వేదికల ద్వారా కొంతమందికి చేరినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
MPSC Paper Leak | మొత్తం నియామక ప్రక్రియ రద్దు
పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడంతో MPSC అప్రమత్తమైంది. నియామక ప్రక్రియపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో మొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
MPSC Paper Leak | ముగ్గురు MPSC అధికారుల అరెస్టు
ఈ కేసులో ఇప్పటికే MPSCకి చెందిన ముగ్గురు అధికారులు సహా పలువురిని క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో MPSC అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న విశ్వేశ్వర్ దత్తాత్రేయ నకాతే, గోపాల్ భట్టు మరాఠే, MPSC అండర్ సెక్రటరీ అభిజిత్ గణపత్రావ్ లెంద్వే ఉన్నారు.
అలాగే కౌటిల్య అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్ దిలీప్ పాటిల్, అమృత్ నామ్వ్ పాటిల్, లోకేష్ అలియాస్ గౌరవ్ రాజేంద్ర పాటిల్‌ను కూడా ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
MPSC Paper Leak | ముందుగానే ప్రశ్నలు సేకరించినట్లు అనుమానం
నిందితులు పరస్పరం కలిసి పరీక్షకు ముందే ప్రశ్నలను సేకరించి, వాటిని ప్రత్యేక సెట్లుగా రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం ఆ ప్రశ్నలను అనధికార వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.
తాజాగా రుతుజా పాటిల్ అరెస్టుతో కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లీకైన ప్రశ్నపత్రం ఎవరెవరికి చేరింది..? దాని వెనుక ఉన్న నెట్వర్క్ ఏమిటనే అంశాలపై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.