IAS Padma Jaiswal | బ్యూరోక్రసీలో ప్రకంపనలు.. అవినీతి ఆరోపణలతో ఐఏఎస్ అధికారిణి పద్మ జైస్వాల్ బర్తరఫ్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IAS Padma Jaiswal | దేశ పరిపాలనా యంత్రాంగంలో అరుదైన సంచలన నిర్ణయం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 2003 బ్యాచ్‌కు చెందిన ఏజీఎంయూటీ (AGMUT) క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పద్మ జైస్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది.

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు కావడంతో రాష్ట్రపతి ఆమోదంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఈ కఠిన చర్య తీసుకుంది.

IAS Padma Jaiswal | అసలేం జరిగింది?

పద్మ జైస్వాల్ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ విభాగంలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆమెపై ఉన్న ఆరోపణలు సుమారు 18 ఏళ్ల నాటివి.

2007-08 కాలంలో ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదాయాన్ని పక్కదారి పట్టించినట్లు, ప్రజా నిధులను దుర్వినియోగం చేసినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు.

2008లో ఆమెను మొదటిసారి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ కొనసాగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC), యూపీఎస్సీ (UPSC) ఆమెను సర్వీసు నుంచి తొలగించాలని సిఫార్సు చేశాయి.

IAS Padma Jaiswal | కోర్టు తీర్పుతో వేగవంతమైన చర్యలు

కాగా, మధ్యలో ఈ కేసు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) పరిధిలోకి వెళ్లినప్పుడు, సాంకేతిక కారణాలతో విచారణ నిలిచిపోయింది. అయితే, గత నెల (ఏప్రిల్) 1న ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం ఇచ్చింది. దీంతో పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ చర్యలను హోం శాఖ వేగవంతం చేసి, తాజాగా ఆమెను బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Padma Jaiswal | ‘జీరో టాలరెన్స్’

సాధారణంగా ఐఏఎస్ స్థాయి అధికారులపై సస్పెన్షన్ వంటి చర్యలు ఉంటాయి కానీ, ఏకంగా సర్వీసు నుంచి తొలగించడం (Removal from Service) అనేది చాలా అరుదైన పరిణామం.

ఆమె 2003 బ్యాచ్‌కు చెందిన AGMUT (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాలు) క్యాడర్ అధికారిణి. అవినీతి విషయంలో ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేదని) విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్రం ఈ చర్య ద్వారా స్పష్టం చేసినట్లయింది.

ఈ నిర్ణయం ప్రస్తుతం ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ, పాత అవినీతి కేసుల నీడ అధికారుల భవిష్యత్తుపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *