అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Covid Cases | దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ పాజిటివ్ కేసులు వేగంగా నమోదవుతుండటంతో పాటు మరణాలు సంభవించాయి. అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై టెస్టుల సంఖ్యను పెంచింది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తూ, పాజిటివ్ వచ్చినవారికి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు.
Telangana Covid Cases | తెలంగాణలో సైలెంట్ ఎంట్రీ..
మరోవైపు తెలంగాణలోనూ కరోనా వైరస్ సైలెంట్‌గా విస్తరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతనెలలో హైదరాబాద్‌లోని ( Hyderabad ) తార్నాకకు చెందిన 38 సంవత్సరాల మహిళ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటల్లోనే మృతి చెందారు. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, కోవిడ్ కారణంగానే మరణించినట్లు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. అలాగే గత నెలలోనే గాంధీ ఆస్పత్రిలోనూ ఓ కరోనా కేసు నమోదైంది.
Telangana Covid Cases | టెస్టుల నిలిపివేతపై విమర్శలు..
ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెరుగుతున్నప్పటికీ, తెలంగాణలో కోవిడ్ గణాంకాలు మాత్రం సున్నాగా చూపుతుండటం గమనార్హం. ఆస్పత్రులకు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలతో చాలా మంది వస్తున్నప్పటికీ టెస్టులు నిర్వహించకపోవడం వల్లే అసలు కేసులు బయటపడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో టెస్టు కిట్లు అందుబాటులో లేకపోవడమే పరీక్షలు నిలిచిపోవడానికి ప్రధాన కారణమని వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా కరోనా ప్రభావం లేకపోవడంతో ప్రభుత్వం టెస్టు కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొనుగోలును పూర్తిగా నిలిపివేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ కరోనా మళ్లీ విజృంభిస్తే పరిస్థితి ఏంటనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడైనా ఆరోగ్య శాఖ స్పందించి, తక్షణమే కరోనా టెస్టు కిట్లను అందుబాటులోకి తెచ్చి పరీక్షలు నిర్వహించాలని ప్రజలు తీవ్రంగా కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmikant Rao | ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీ ప్రభుత్వం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు