Heavy Rains | దంచికొడుతున్న వానలు.. పలు జిల్లాలకు అలర్ట్​

రానున్న రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణుడు బాలాజీ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్​, ఉమ్మడి కరీంనగర్​, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 36 గంటల్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మొత్తం వర్షపాతం 300-450 మి.మీ వరకు నమోదై భారీ వరదలకు దారి తీసే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్​, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్​, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి.

Heavy Rains | ముసురు పెట్టింది

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున నుంచి ముసురు పెట్టింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా జగిత్యాల జిల్లా సారంగపూర్​లో 140.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బుగ్గారంలో 138, నిర్మల్​లో 128.3, కడ్డం పెద్దూరు 127.5, మామడ 118, జగిత్యాల జిల్లా వెల్గటూర్ 123, మల్లాపూర్ 112.5, ఎండపల్లి 111.5, నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​లో 108, కామారెడ్డి జిల్లా జుక్కల్​లో 100.3 మి.మీ. వర్షం కురిసింది.

Heavy Rains | అప్రమత్తంగా ఉండాలి

నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే వాగులు, నదులకు జలకళ వచ్చింది. ఈ వానాకాలం సీజన్​లో తొలిసారి వాగులు పారుతున్నాయి. చెరువులు, డ్యామ్​ల్లోకి నీరు వచ్చి చేరుతోంది. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలను వరద ముంచెత్తే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. వాగులు, చెరువులు, వంతెనల వద్దకు వెళ్లొద్దు. చేపలు పట్టడం లాంటి పనులు చేయొద్దు. శిథిలావస్థలో చేరిన ఇళ్లలో ఉండొద్దు.

ఇది కూడా చదవండి..: HYDRAA High Court | హైడ్రా చర్యలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం..రెండు కేసుల్లో కీలక ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *