Modi Bengaluru Security|ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనకు ముందు నగరంలో భారీ భద్రతా ముప్పు పొంచి ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రధాని ప్రయాణించే మార్గానికి సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.
Modi Bengaluru Security|సరస్సు సమీపంలో పేలుడు పదార్థాల గుర్తింపు..
పోలీసుల కథనం ప్రకారం.. కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని తాతగుణి ప్రాంతంలో ఉన్న అగర సరస్సు వద్ద కొన్ని జిలాటిన్ స్టిక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని పర్యటన కోసం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ పేలుడు పదార్థాలు బయటపడటం సంచలనంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన బాంబు నిర్వీర్యక దళాలు , ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Modi Bengaluru Security|ఒకరి అరెస్ట్..
ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోరమంగళ సమీపంలోని ఒక ఇంట్లో నివసిస్తున్న వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ఒక రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. ఆ పేలుడు పదార్థాలను అక్కడ ఎందుకు ఉంచారు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేదా అక్రమంగా నిల్వ చేశారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పట్టుబడిన వ్యక్తి వివరాలను పోలీసులు ఇంకా బహిరంగపరచలేదు.
Modi Bengaluru Security|నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత..
ఈ ఘటన నేపథ్యంలో బెంగళూరు నగరం అంతటా నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీ పర్యటించే మార్గాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిందితుడి నుంచి సేకరించే సమాచారం ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడవుతాయని ఉన్నతాధికారులు తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని పర్యటన ఉండటంతో, భద్రతా సంస్థలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Vijay CM Speech | ‘మీ ఇంటి వ్యక్తినే నేను’.. ఈ విజయ్ మామ మీకు అన్ని విధాలా మంచి చేస్తాడంటూ కామెంట్

