అక్షరటుడే వెబ్‌డెస్క్: R Narayana Murthy | ప్రజాగాయకుడు, విప్లవ సాంస్కృతిక యోధుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం( జులై 25 )హైదరాబాద్‌లోని ( Hyderabad )బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. వేణు అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, సతీష్ చందర్, అరుణోదయ విమలక్క, ప్రొఫెసర్ వినయ్ బాబు తదితరులు పాల్గొని నాగన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలను, ఉద్యమ పాటల ప్రాముఖ్యతను వక్తలు స్మరించుకున్నారు. అనంతరం ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల కళాకారులచే కళా ప్రదర్శనలు నిర్వహించారు.
R Narayana Murthy | నాగన్న సేవలు చిరస్మరణీయం..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. నాగన్న ప్రజల ఆశయాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఇదే సమయంలో ప్రస్తుత విద్యా వ్యవస్థపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షల్లో చూసి రాయడం అనేది నాగసాకిపై వేసిన ఆటం బాంబు కంటే ప్రమాదకరమని హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీలు, చూసి రాసే విధానాలపై సోనమ్ వాంగ్ చుక్ ఆధ్వర్యంలో విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద చేస్తున్న పోరాటం వారి నిజాయితీకి నిదర్శనమన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు కాపీ కొట్టి పాసైతే భవిష్యత్తులో వారు నిర్మించే బ్రిడ్జీలు కూలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
R Narayana Murthy | కమ్యూనిస్టులందరూ ఏకం కావాలి..
దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సక్రమంగా అమలు కావడం లేదని ఆర్.నారాయణమూర్తి వాపోయారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ చీలికలతో ముక్కలైపోయామని, కార్ల్ మార్క్స్ నినాదస్ఫూర్తితో కమ్యూనిస్టులందరూ ఒకే జెండా కిందకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ ఏకమైతేనే ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురుతుందని, రాజ్యాంగ ఉల్లంఘనలు ఆగి, సహజ వనరులు కార్పొరేట్ల పరం కాకుండా కాపాడుకోగలమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకటరామయ్య, ఉదయగిరి, కె.గోవర్ధన్, సన్నశెట్టి రాజశేఖర్, పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్ స్టూడెండ్ బిల్డర్ గ్రూప్’ ప్రారంభం