అక్షరటుడే వెబ్‌డెస్క్: Chandrababu Local Elections | ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh )స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు. మంత్రులు, నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ కీలక నేతలతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ఎన్నికల దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
Chandrababu Local Elections | మెరుగైన స్ట్రైక్‌రేట్ లక్ష్యం..
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత మెరుగైన స్ట్రైక్‌రేట్ సాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ తొలిసారిగా కూటమిగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, భాగస్వామ్య పార్టీల మధ్య ఎక్కడా స్పర్థలు రాకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి ఎన్డీఏ పక్షాలు కలిసికట్టుగా పని చేసేలా స్థానిక నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు.
Chandrababu Local Elections | బీసీ రిజర్వేషన్లపై స్పష్టత..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే అంతకంటే ఎక్కువే కేటాయిస్తామని, ఒక్క శాతం కూడా తగ్గించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీనిపై కొన్ని అడ్డంకులు సృష్టించేందుకు కోర్టులను ఆశ్రయించినా, ప్రభుత్వం తరఫున పకడ్బందీగా న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇక అభ్యర్థుల ఎంపికలో యువత, మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు, కార్యకర్తల ఆమోదం, అభ్యర్థుల పనితీరుతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సరైన వారికే అవకాశం కల్పిస్తామన్నారు.
Chandrababu Local Elections | ఫేక్ ప్రచారాలకు చెక్..
ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనకాపల్లికి నీటి విడుదల, హంద్రీ-నీవా ద్వారా రాయలసీమ చివరి ప్రాంతాలకు సాగునీరు అందించడం వంటి మైలురాళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ వివరించాలని కోరారు.
మరోవైపు, ప్రతిపక్షాల కుట్రలు మరియు సోషల్ మీడియా వేదికగా జరిగే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని శ్రేణులను అప్రమత్తం చేశారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు మరింత సన్నద్ధం చేసేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ‘లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Teachers Non Teaching Duties | టీచరా.. డేటా ఎంట్రీ ఆపరేటరా..? బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు బిజీబిజీ..