అక్షరటుడే, ఎల్లారెడ్డి: Teachers Non Teaching Duties | దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రాథమిక విద్యకు (Government Schools) ఉపాధ్యాయుడే ప్రధాన స్తంభం. అయితే నేడు ఉపాధ్యాయుడు బోధన కంటే బోధనేతర బాధ్యతలకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. డేటా నమోదు, ఆన్లైన్ బిల్లులు, పరిపాలనా పనుల భారంతో తరగతి గది వెనుకబడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో (Telangana Education) నాణ్యమైన విద్య ఎలా సాధ్యమనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.
Teachers Non Teaching Duties | విద్యాప్రమాణాల మెరుగుదలకు..
విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని పాలకులు పదేపదే ప్రకటిస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పోర్టల్‌లో డేటా నమోదు చేస్తూ, బిల్లులు తయారు చేస్తూ, స్ప్రెడ్ షీట్లు నింపుతూ తన రోజును గడపాల్సి వస్తోంది.
Teachers Non Teaching Duties | అవకాశముంటేనే పాఠం..
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు బోధన చేయడం, విలువలను నేర్పించడం, సమాజానికి బాధ్యతాయుత పౌరులను అందించడం. కానీ నేడు అదే ఉపాధ్యాయుడు తన అసలు బాధ్యతకు సమయం దొరకని దుస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వాలు ప్రతి సమస్యకు ఉపాధ్యాయుడినే పరిష్కారంగా భావిస్తున్నాయి.. విద్యకు సంబంధం ఉన్నా, లేకపోయినా ప్రతి కార్యక్రమం చివరకు పాఠశాలపై, ఉపాధ్యాయుడి పైనే మోపబడుతోంది.
Teachers Non Teaching Duties | ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే..
ఉదయం పాఠశాల ప్రారంభమైన క్షణం నుండి ప్రార్థన కార్యక్రమం, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ ఆన్లైన్ హాజరు నమోదు, పాఠశాలకు రాని విద్యార్థుల వివరాలు సేకరించడం, రాగి జావా పంపిణీ, మధ్యాహ్న భోజన ఏర్పాట్ల పర్యవేక్షణ, ఈ భోజన వివరాల ఆన్లైన్ అప్లోడ్, పరిశుభ్రత తనిఖీలు, దీంతోనే పాఠశాలలో సగం సమయం గడుస్తోంది. ఇక తల్లిదండ్రులతో మాట్లాడటం, బడి తోట నిర్వహణ, లైబ్రరీ కార్యక్రమాలు, క్రీడల పర్యవేక్షణ, విద్యార్థుల భద్రత, గాయపడిన వారికి ప్రథమ చికిత్స, ఈ పనుల మధ్యలో అవకాశం దొరికితే ఒక తరగతికి పాఠం చెప్పడం. ఇది అతిశయోక్తి కాదు, అనేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇదే వాస్తవ పరిస్థితి.
డేటాకు ఉన్న ప్రాధాన్యత బోధనకు లేదా..?
విద్యాశాఖలో ఒక విచిత్రమైన ధోరణి పెరుగుతోంది. విద్యా ప్రమాణాలు తగ్గితే ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తారు. కానీ ఆ ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన బోధనా సమయాన్ని మాత్రం వారికి ఇవ్వరు.. ఒకవైపు ‘ఫలితాలు మెరుగుపర్చండి’ అని ఆదేశాలు జారీ చేస్తారు. మరోవైపు అదే ఉపాధ్యాయుడిని డేటా సేకరణ, పోర్టల్ అప్లోలోడ్లు, గణాంకాల తయారీ, సమావేశాలు, సర్వేలతో ముంచెత్తుతారు.. చివరకు బోధనకు సమయం లేకపోయినా ఫలితాల బాధ్యత మాత్రం ఉపాధ్యాయుడిదే. ఇది పరిపాలనా వైరుధ్యం కాకపోతే మరేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వాట్సప్‌లో ‘అర్జెంట్’ అనే సందేశాలే ఎక్కువ..
ప్రస్తుతం విద్యాశాఖలో డేటాకు ఉన్న ప్రాధాన్యత విద్యకు లేదనే విమర్శ వినిపిస్తోంది. విద్యార్థి చదవడం నేర్చుకున్నాడా? లేదా అన్నదాని కంటే పోర్టల్‌లో సమాచారం అప్లోడ్ అయ్యిందా.. లేదా? అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. అధికారులకు క్షేత్ర స్థాయి వాస్తవాల కంటే గూగుల్ షీట్లు, ఎక్సెల్ పట్టికలు, డాష్ బోర్డులు ముఖ్యమైపోయాయి. వాట్సాప్‌లో వచ్చే ‘అర్జెంట్’ సందేశాలు ఉపాధ్యాయులకు నిత్యకృత్యంగా మారాయి. తరగతి గదిలో బోధన జరుగుతుందా లేదా అన్నదానికంటే డేటా సమయానికి చేరిందా? లేదా అన్నదే ముఖ్యంగా మారడం ఆందోళనకర పరిణామం.
వేధిస్తోన్న సిబ్బంది కొరత..
ప్రస్తుతం అనేక పాఠశాలల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. చాలా బడుల్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులే మొత్తం పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఒకవైపు బహుళ తరగతులకు బోధన, మరోవైపు అన్ని పరిపాలనా బాధ్యతలు.. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్యను ఆశించడం అంటే వాస్తవాన్ని విస్మరించినట్లే. విద్యా ప్రమాణాలపై చర్చించే ముందు ఉపాధ్యాయుడికి బోధనకు ఎంత సమయం లభిస్తుందో ప్రభుత్వం నిజాయితీగా అంచనా వేయాలి. ఈ పరిస్థితి కొనసాగితే అత్యధిక నష్టం విద్యార్థులకు జరుగుతుందని విద్యా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుడి సమయం ఎంత మేరకు బోధనేతర కార్యక్రమాలకు వెళ్తుందో.. అంత మేరకు విద్యార్థులు నాణ్యమైన బోధనకు దూరమవుతారు.
బోధనేతర పనులకు దూరం చేయాలి..
ప్రభుత్వాలు నిజంగా విద్యా సంస్కరణలు కోరుకుంటే మొదట చేయాల్సిన పని ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి విముక్తి చేయడం. పాఠశాలలకు పరిపాలనా సహాయక సిబ్బందిని నియమించాలి. బోధనేతర పనులకు ప్రత్యేక సిబ్బంది ఉండాలి. లేదంటే ‘నాణ్యమైన విద్య’ అనే నినాదం కేవలం ప్రకటనల్లో మాత్రమే మిగిలిపోతుంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కాదు.. అతడు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి. ఆ శిల్పి చేతిలో పుస్తకాలకు బదులు ఫైళ్లు, బిల్లులు, మొబైల్ యాప్‌లు పెట్టినంత కాలం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం ఎండమావిని వెంబడించినట్టే అవుతుందనీ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: జెన్‌జీలకు దగ్గరవడంపై పవన్ కళ్యాణ్ ఫోకస్..