అక్షరటుడే వెబ్‌డెస్క్: Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) అఫిడవిట్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) రిపోర్టులు చెంపపెట్టు లాంటివని మాజీ మంత్రి హరీశ్ ( Harish Rao )రావు అన్నారు. కాళేశ్వరం మొత్తం కుప్పకూలిందని, ప్రాజెక్టు పనికిరాదని, నీళ్లు ఎత్తలేమంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా అవాస్తవమని తేలిపోతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని ఎన్డీఎస్ఏ తన అఫిడవిట్లో స్పష్టంగా తెలిపిందని హరీశ్ రావు గుర్తుచేశారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్‌లోనూ నిర్మాణపరమైన సమస్యలు లేవని, కాంక్రీట్ నాణ్యత కూడా చాలా బాగుందని వెల్లడైందని పేర్కొన్నారు.
Kaleshwaram Project | ప్రభుత్వ తీరుపై ఆగ్రహం..
రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి, రాష్ట్రానికి వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్ చేయకుండా ఆ నీటిని ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేశారని విమర్శించారు. తాము నిలదీసిన తర్వాతే ఆలస్యంగా పంపులు ఆన్ చేశారని, అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్లిపోయిందని ఆరోపించారు.
Kaleshwaram Project | నీటి నిల్వలపై ఆందోళన..
దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16 శాతం ఉంటే.. తెలంగాణలో మాత్రం కేవలం 35.6 శాతం మాత్రమే ఉన్నాయని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. పార్టీలో కుమ్ములాటలు, కొట్లాటలపై శ్రద్ధ పక్కనపెట్టి ప్రాజెక్టుల నిర్వహణ, రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం మానేసి, వెంటనే అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోయాలని కోరారు.
ఇది కూడా చదవండి: Arvind Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు