FBI Scam Network | అమెరికా వృద్ధులకు భారత్ స్కామర్ల టోకరా.. గుట్టురట్టు చేసిన FBI

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: FBI Scam Network | అమెరికాలోని వృద్ధులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న భారతదేశానికి చెందిన ఒక భారీ స్కామ్ నెట్‌వర్క్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI), భారత సైబర్ క్రైమ్ విభాగాలు సంయుక్తంగా కలిసి ఛేదించాయి. సాంకేతిక సాయం (టెక్-సపోర్ట్), ప్రభుత్వ పథకాల పేరుతో నకిలీ కాల్ సెంటర్లు నడుపుతూ అమెరికా పౌరుల నుంచి మిలియన్ల డాలర్లు దోచుకున్నట్లు అధికారులు గుర్తించారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ రికార్డుల ప్రకారం.. 2016 నుండి 2022 మధ్య కాలంలో భారతదేశంలోని వివిధ నకిలీ కాల్ సెంటర్ల ద్వారా వేలాది మంది వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు.

FBI Scam Network | భయాందోళనలనే పెట్టుబడిగా ..

ఈ కేటుగాళ్లు బాధితులను బురిడీ కొట్టించడానికి ఒక పక్కా ప్లాన్ అమలు చేశారు. ముందుగా వృద్ధుల కంప్యూటర్ స్క్రీన్లపై వైరస్ లేదా సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయంటూ నకిలీ పాప్-అప్ మెసేజ్‌లను పంపేవారు. ఆ తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే డేటా మొత్తం పోతుందని భయపెట్టి, స్క్రీన్‌పై కనిపించే ఒక టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయమని కోరేవారు. బాధితులు భయంతో కాల్ చేయగానే.. తాము టెక్నీషియన్లమంటూ నమ్మించి వారి కంప్యూటర్ల రిమోట్ కంట్రోల్‌ను తమ చేతుల్లోకి తీసుకునేవారు. ఆపై చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూపిస్తూ, వాటిని ఫిక్స్ చేయడానికి వైర్ ట్రాన్స్‌ఫర్, గిఫ్ట్ కార్డ్‌లు లేదా నగదు రూపంలో భారీగా డబ్బులు వసూలు చేసేవారు.

FBI Scam Network | టెలికాం అధికారుల అండతో ..

ఈ అంతర్జాతీయ కుంభకోణానికి కొందరు టెలికాం కంపెనీ అధికారులు కూడా సహకరించినట్లు విచారణలో తేలింది. ఒక టెలికాం సంస్థకు చెందిన మాజీ సీఈఓ ఆడమ్ యంగ్ (42), మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హారిసన్ గెవిర్ట్జ్ (33) ప్రోవిడెన్స్‌లోని ఫెడరల్ కోర్టులో తమ తప్పును అంగీకరించారు. తాము సాయం చేస్తున్నది చట్టవిరుద్ధమైన మోసపూరిత సంస్థలని తెలిసి కూడా.. కాల్ రూటింగ్, ట్రాకింగ్, ఫార్వార్డింగ్ , ప్రత్యేక ఫోన్ నంబర్ల వంటి కీలక సేవలను ఈ స్కామర్లకు క్రమపద్ధతిలో అందించినట్లు వారు ఒప్పుకున్నారు. వీరి వాంగ్మూలంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది.

FBI Scam Network | నిందితులకు ఖరారైన శిక్ష

ఈ భారీ దర్యాప్తులో భాగంగా అమెరికా, భారత ఏజెన్సీలు నిందితులపై గట్టి నిఘా ఉంచి పట్టుకున్నాయి. ఈ కేసులో భారతదేశానికి చెందిన ఐదుగురు ఆపరేటర్లతో పాటు, ఈ మోసపూరిత నెట్‌వర్క్‌ను నడపడానికి సహకరించిన ఒక మాజీ అంతర్గత వ్యక్తికి ఎఫ్‌బీఐ బోస్టన్ విభాగం ఇప్పటికే శిక్షలు ఖరారు చేసింది. టెలికాం ఎగ్జిక్యూటివ్‌లు కూడా తాము దోషులమని కోర్టులో ఒప్పుకోవడంతో ఈ అంతర్జాతీయ స్కామ్ నెట్‌వర్క్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడినట్లయింది.

ఇది కూడా చదవండి: Tamil Nadu CM Vijay | ఆహా.. ఓహో.. అంతేనా? అతిశయోక్తులతో అభాసుపాలవుతున్న తమిళనాడు సీఎం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *