అక్షరటుడే, వెబ్‌డెస్క్: ITR Filing | పన్ను మదింపు సంవత్సరం 2026-27కు సంబంధించి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (Income Tax Returns) సమర్పించడానికి తుది గడువు సమీపిస్తోంది. ఈనెల 31వ తేదీలోగా ఐటీఆర్ పైల్ చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో అందరూ ఒకేసారి దాఖలు చేస్తే సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.
గడువు ముగిసిన తర్వాత ఫైల్ చేసినా, ఆదాయాన్ని దాచిపెట్టినా పెనాల్టీలు తప్పవు. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేస్తే పన్ను రీఫండ్ వేగంగా ప్రాసెస్ అవ్వడంతోపాటు భవిష్యత్తులో రుణాలు పొందడానికి, వీసా ప్రక్రియలకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి జరిమానాలు ఉంటాయో తెలుసుకుందామా..
ITR Filing | గడువు దాటితే..
ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈనెలాఖరు వరకు గడువుంది. ఒకవేళ నిర్దేశిత గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మొత్తం వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే వెయ్యి రూపాయలు, ఎక్కువ ఉంటే రూ. 5 వేల జరిమానా విధిస్తారు.
ITR Filing | ఆదాయం వివరాలు దాచిపెడితే..
పన్నుపోటును తగ్గించుకోవడానికి ఆదాయాన్ని తక్కువగా చూపించడాన్ని ఆదాయపన్ను శాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. ఇలా చేస్తే చెల్లించాల్సిన పన్నుపై 50 శాతం నుంచి 200 శాతం వరకు జరిమానా విధించడానికి ఆస్కారం ఉంటుంది.
ITR Filing | సవరించిన రిటర్న్స్ సమర్పణ ఆలస్యమైతే..
మొదట దాఖలు చేసిన ఐటీఆర్‌లో ఏవైనా పొరపాట్లు దొర్లితే వాటిని సరి చేసి, సవరించిన రిటర్న్స్ ఇవ్వడంలో కూడా జాప్యం జరిగితే ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరిమానా విధిస్తుంది. ఇది వెయ్యి రూపాయలనుంచి రూ. 5 వేల వరకు ఉండొచ్చు.
సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టకపోతే..
ఐటీఆర్ రిటర్న్స్ సమర్పించే ముందు మిగిలి ఉన్న పన్ను బాధ్యతను చెల్లించడంలో విఫలమైతే.. బాకీ ఉన్న పన్ను మొత్తానికి సమానమైన జరిమానా విధించే అవకాశాలుంటాయి.
ఎక్కువ నగదును స్వీకరిస్తే..
చట్టపరమైన పరిమితిని మించి, ఒకేరోజు రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించడమమనేది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దీనికి జరిమానా విధిస్తారు.
ఇది కూడా చదవండి..: Paper Leak Punishment | పేపర్ లీక్‌కు పాల్పడితే పదేళ్ల జైలు.. కేంద్రం కీలక నిర్ణయం !