అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR NEET Protest | తరం మారుతుంది, స్వరం మారుతుంది మోదీ జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేపాల్‌లో యువత తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయిందని గుర్తు చేశారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద యువత నిరసన తెలుపుతున్నారు. వారికి శుక్రవారం కేటీఆర్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని యువత కదం తొక్కారన్నారు. 25 రోజుల పాటు సోనమ్ వాంగ్‌చుక్ గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష చేశారని చెప్పారు. అయితే ఈడీ, సీబీఐలకు భయపడి దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదని ఆరోపించారు. కానీ విద్యార్థులు తమకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారని కొనియాడారు.
KTR NEET Protest | లీకిన్ ఇండియా ఇచ్చారు
మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారని పేర్కొన్నారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకతీతంగా యువత పోరాడుతున్నారని, వారిపై జరుగుతున్న దాడులు దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు అండగా నిలబడేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
KTR NEET Protest | భయపడే జనరేషన్ కాదు
ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ జనరేషన్ చావుకు భయపడే రకం కాదని చెప్పారు. ఐటీ, ఈడీ సోదాలకు భయపడేవారు కాదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
KTR NEET Protest | నల్లమల పిల్లి ఎక్కడ
సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు తమను అడ్డుకున్నారని తెలిపారు. బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోదీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్‌లో దాక్కుందని ఎద్దేవా చేశారు.
KTR NEET Protest | కేసీఆర్ కూడా వస్తారు
అవసరమైతే విద్యార్థుల కోసం కేసీఆర్ కూడా వస్తారని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో యువత ఆందోళన చూసి ఆయన తల్లడిల్లుతున్నారని పేర్కొన్నారు. పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. పేపర్ లీక్‌కు తనకేం సంబంధం అని కేటీఆర్ ప్రశ్నించారు. పేపర్ లీకుకు.. తనకు సంబంధం ఉందని నిరూపించి ఇందిరాపార్క్ దగ్గర ఉరితీయాలన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పేపర్ లీక్ విషయంలో కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. దీంతో ఆయన స్పందించారు.
ఇది కూడా చదవండి..: Singareni Expansion Plans | సింగరేణి ఇతర రంగాలలోకి విస్తరించాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క