Supreme Court SC Status | మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారు.. సుప్రీంకోర్టు

మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court SC Status | మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్​ను ధర్మాసనం కొట్టివేసింది.

హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతంలోకి మారినప్పుడు ఒక వ్యక్తి షెడ్యూల్డ్ కుల (SC) హోదాను కోల్పోతారని మార్చిలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇతర మతాలకు మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని స్పష్టం చేసింది. తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి వస్తేనే ఎస్సీ హోదా పొందవచ్చని తెలిపింది. జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం తాము సమీక్ష పిటిషన్‌ను పరిశీలించామని, మునుపటి తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం కనిపించలేదని పేర్కొంది.

Supreme Court SC Status | మూడు షరతులు..

మూడు షరతులు నెరవేర్చినట్లయితే తిరిగి మతం మారిన తర్వాత అటువంటి వ్యక్తి షెడ్యూల్డ్ కుల హోదాను పొందవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఆ వ్యక్తి తాను షెడ్యూల్డ్ కులంలో పుట్టానని నిరూపించుకోవాలి. హిందూ, సిక్కు లేదా బౌద్ధమతంలోకి నిజంగా తిరిగి మారారని, గతంలో స్వీకరించిన మతాన్ని పూర్తిగా త్యజించారని నిరూపించుకోవాలి. వారి అసలు కుల వర్గానికి చెందిన సభ్యులు వారిని తిరిగి స్వీకరించారని ఆధారాలు సమర్పించాలి. అప్పుడు మాత్రమే సదరు వ్యక్తికి తిరిగి ఎస్సీ హోదా వస్తుంది. ఈ షరతులలో ఒక్కటి నిరూపించడంలో విఫలమైనా ఆ దావా నిలవదని కోర్టు స్పష్టం చేసింది.

Supreme Court SC Status | అసలు కేసు ఏమిటంటే..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి షెడ్యూల్డ్ కులంలో పుట్టి, ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తనను కులం పేరుతో దూషించారని, బెదిరించారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు. నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా, ఫిర్యాదిదారుడు క్రైస్తవ మతంలోకి మారినందున చట్టప్రకారం షెడ్యూల్డ్ కుల హోదాను పొందలేరని పేర్కొంటూ హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఫిర్యాదిదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా చుక్కెదురైంది. కాగా దేశవ్యాప్తంగా చాలా మంది ప్రస్తుతం మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదా అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Supreme Court Lathi Charge | లాఠీచార్జీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *