అక్షరటుడే, వెబ్‌డెస్క్: UGC NET Re Exam | దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాలకు నిలయంగా నిలవాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జూన్ 22 నుంచి 30, 2026 వరకు నిర్వహించిన UGC-NET పరీక్షల్లో తీవ్రమైన పొరపాట్లు దొర్లడంతో.. ఏకంగా మూడు ప్రధాన సబ్జెక్టుల (ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ) పరీక్షలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
UGC NET Re Exam | ప్రశ్నపత్రాల్లో కొల్లలుగా తప్పులు
జూన్ 2026లో 87 సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్షలో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు రావడంతో ఎన్టీఏ విచారణ కమిటీని వేసింది. ఈ కమిటీ పరిశీలనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- ప్రముఖ పండితుల పేర్లలో స్పెల్లింగ్ తప్పులు, పుస్తకాల పేర్లను తారుమారు చేయడం.
- అనువాద దోషాలు, వ్యాకరణ (Grammar) తప్పులు, పంక్చుయేషన్ లోపాలు.
- సబ్జెక్ట్ భావనలను తప్పుగా పేర్కొనడంతో పాటు, గతంలో అడిగిన ప్రశ్నలనే పెద్ద సంఖ్యలో యథాతథంగా పునరావృతం చేయడం.
కేవలం కొన్ని ప్రశ్నలను తొలగించడం (Dropping Questions) ద్వారా ఈ స్థాయిలో ఉన్న తీవ్రమైన దోషాలను సరిదిద్దలేమని, పరీక్ష పారదర్శకతను కాపాడటానికి తిరిగి పరీక్ష నిర్వహించడమే ఏకైక మార్గమని కమిటీ స్పష్టం చేసింది.
UGC NET Re Exam | రీ-ఎగ్జామ్ పూర్తి షెడ్యూల్ ఇదే..
NTA విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. తీవ్రమైన లోపాల వల్ల రద్దయిన మూడు యూజీసీ-నెట్ సబ్జెక్టుల పునఃపరీక్షలను 2026 సెప్టెంబరు 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఇంగ్లీష్ (English) పేపర్: ఈ పరీక్షను సెప్టెంబరు 9, 2026న మొదటి షిఫ్ట్‌లో భాగంగా ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహిస్తారు.
కామర్స్ (Commerce) పేపర్: ఈ పరీక్షను సెప్టెంబరు 9, 2026న రెండో షిఫ్ట్‌లో భాగంగా మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు నిర్వహిస్తారు.
సోషియాలజీ (Sociology) పేపర్: ఈ పరీక్షను సెప్టెంబరు 10, 2026న మొదటి షిఫ్ట్‌లో భాగంగా ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహిస్తారు.
ఈ రీ-ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థుల నుంచి ఎలాంటి అదనపు పరీక్షా రుసుమును వసూలు చేయరని, పరీక్షా కేంద్రాలు, అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారని ఎన్టీఏ పేర్కొంది.
మిగతా 84 సబ్జెక్టుల ఫలితాలు, JRF కేటాయింపులు, PhD ప్రవేశాలు ఎలాంటి ఆలస్యం లేకుండా పాత షెడ్యూల్ ప్రకారమే వెల్లడవుతాయని ఎన్టీఏ స్పష్టం చేసింది.
UGC NET Re Exam | అభ్యర్థులు, విద్యావేత్తల తీవ్ర ఆందోళన
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఎన్టీఏ బాధ్యతారాహిత్యంపై అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నెలల తరబడి రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన విద్యార్థులకు, ఏజెన్సీ చేసిన దారుణమైన తప్పుల వల్ల మళ్లీ సెప్టెంబరు వరకు నిరీక్షించాల్సి రావడం తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తోంది.
అకడమిక్ ఇయర్ ఇప్పటికే ప్రారంభమైనందున, మళ్లీ పరీక్ష రాసి ఫలితాల కోసం వేచి చూడటంతో కీలకమైన సమయం వృథా అవుతోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
UGC NET Re Exam | బాధ్యులపై చర్య ఏదీ?
జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించే క్రమంలో ప్రశ్నపత్రాల తయారీలో ఇంత పెద్ద ఎత్తున నాణ్యతా లోపాలు ఎందుకు వచ్చాయో అనే దానిపై ఎన్టీఏ స్పష్టత ఇవ్వలేదు. తప్పుల తడకగా పేపర్లు తయారు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
పరీక్షలను రీ-కండక్ట్ చేస్తామని చెప్పి ఎన్టీఏ చేతులు దులుపుకొన్నప్పటికీ, విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఈ తరహా పొరపాట్లు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడటంలోనైనా ఏజెన్సీ పారదర్శకతను పాటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.