Fake Cancer Injections | మందులను కూడా వదలని కేటుగాళ్లు.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్లు

క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రాణాపాయ స్థితిలోని రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయల దందాకు తెరలేపిన భారీ అక్రమ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బట్టబయలు చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Fake Cancer Injections | క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రాణాపాయ స్థితిలోని రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయల దందాకు తెరలేపిన భారీ అక్రమ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బట్టబయలు చేసింది. రూ. లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేసే ‘ఎవాల్యుమాబ్’ (Avelumab) క్యాన్సర్ నిరోధక ఇంజెక్షన్లలో కేవలం నీళ్లు మాత్రమే ఉన్నట్లు జర్మనీకి చెందిన ‘మెర్క్ ల్యాబ్’ పరీక్షల్లో తేలింది. ఇందులో క్యాన్సర్‌ను అణచివేసే అసలైన ఔషధ పదార్థం శూన్యమని వెల్లడైంది. అంతేకాకుండా, రాజస్థాన్ ప్రభుత్వ పథకం కింద ఉచితంగా అందించాల్సిన క్యాన్సర్ మందులను కూడా ఈ ముఠా అక్రమ మార్గంలో మార్కెట్లోకి తరలించి విక్రయించినట్లు దర్యాప్తులో స్పష్టమైంది.

Fake Cancer Injections | ఏడు బృందాలుగా ఏర్పడి..

ఆగస్టు 20న దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు విస్తరించిన సుమారు రూ. 9 కోట్ల విలువైన ఈ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. మొత్తం 17 మంది నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, రూ. 50 లక్షల నగదు, 588 నింపిన యాంటీ-క్యాన్సర్ వైయల్స్, ఇతర మందులకు చెందిన 3,021 యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలలో ఈ సిండికేట్ నెట్‌వర్క్ విస్తరించింది. జులై 11న డ్రగ్స్ శాఖతో కలిసి పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన దాడుల్లో ఈ భారీ గుట్టు రట్టయింది.

Fake Cancer Injections | మందుల సేకరణ..

ఈ ముఠా ప్రధానంగా మూడు మార్గాల్లో మందులను సేకరించేది. అక్రమ వనరుల నుంచి నకిలీ మందులను కొనుగోలు చేయడం, ఆసుపత్రులలో రోగుల కోసం కేటాయించిన మందులను పక్కదారి పట్టించడం, ప్రభుత్వ సంస్థల నుంచి లబ్ధిదారులకు చేరాల్సిన మందులను దొంగిలించడం వంటి పనులకు పాల్పడేవారు. ఎలాంటి లైసెన్సులు, బిల్లులు లేకుండా రహస్య ప్రాంతాలలో వీటిని నిల్వ చేసేవారు.

అసలు మందుల కార్టన్లు, ఖాళీ పెట్టెలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, ధరల (MRP) వివరాలను ‘ఎసిటోన్’తో చెరిపివేసి, సరికొత్తగా ప్యాకింగ్ చేసి దళారుల ద్వారా మార్కెట్లోకి వదిలేవారు. ఈ దందాలో అభిషేక్ వైశ్య, శుభమ్ కుమార్ చౌదరి, సూరజ్ చౌదరి, ఆనంద్ కుమార్, దీపక్, మయాంక్ గార్గ్ వంటి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2022 నుంచి ఈ రాకెట్ నడుస్తుండగా.. ఈ నకిలీ, ప్రభుత్వ మందులు ఎంతకాలంగా చెలామణిలో ఉన్నాయి, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: AP Drought Crisis | రాష్ట్రంలో కరువు ఉన్నా సీఎం స్పందించడం లేదు : వైఎస్​ జగన్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *