అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Drought Crisis | ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. అయినా కూడా సీఎం చంద్రబాబు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 52 శాతం లోటు వర్షపాతం ఉందని పేర్కొన్నారు. కరువు దారుణంగా ఉన్నా చంద్రబాబు (CM Chandrababu) కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 688 మండలాలకు గాను 628 మండలాల్లో లోటు వర్షపాతం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోస్తాలోనూ కరువు ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కరువును గుర్తించేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.
AP Drought Crisis | రైతులను మోసం చేశారు
వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు పబ్లిసిటీ పిచ్చితో రైతులను మోసం చేశారని జగన్ అన్నారు. నీళ్లు ఇస్తారని నమ్మి రైతులు అష్టకష్టాలు పడి వితనాలు, ఎరువులు కొని నార్లు నాటారన్నారు. అయితే ప్రస్తుతం నీరు లేక అవన్నీ ఎండిపోయిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకురావడం లేదని మండిపడ్డారు. ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. శ్రీశైలం నుంచి అటు తెలంగాణ, ఇటు ఏపీ ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని జగన్ అన్నారు. ఇలానే కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు పడిపోతుందని, అప్పుడు రాయలసీమకు నీళ్లు ఇవ్వలేరన్నారు.
AP Drought Crisis | బీసీలకు న్యాయం చేశాం
వైసీపీ హయాంలో బీసీలకు న్యాయం చేశామని జగన్ పేర్కొన్నారు. 40 శాతం మంత్రి పదవులు బీసీలకే ఇచ్చామని వెల్లడించారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపామని, 6 జెడ్పీ ఛైర్మన్ సీట్లు, 9 మేయర్ స్థానాలను బీసీలకు కేటాయించామని వివరించారు. వివిధ పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో..రూ.లక్షా 30 వేల కోట్లు బీసీలకు అందజేశామన్నారు.
ఇది కూడా చదవండి..: Venkaiah Naidu Free Schemes | విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. నగదు కాదు: వెంకయ్య నాయుడు