Godavari River Pollution | కళ్లెదుటే గోదావరి కలుషితమవుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారు?.. అధికారులను నిలదీసిన పవన్​ కళ్యాణ్​

భక్తులు ఎంతో పవిత్రంగా భావించే రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో గోదావరి నది నీరు మురుగునీటి వల్ల తీవ్రంగా కలుషితమైందని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా ఆందోళనకరమైన నిజాలు బయటపడ్డాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Godavari River Pollution | పవిత్ర గోదావరి నదిని పారిశ్రామిక రసాయనాలు, నగర మురుగు నీరు ఎంత దారుణంగా కలుషితం చేస్తున్నాయో.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారులు అందించిన ల్యాబ్ రిపోర్టులో వెలుగు చూశాయి.

గత నెల మే 25న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా బోటుపై వెళ్లి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్స్ (మడుగులు) వద్ద సేకరించిన నీటి నమూనాల పరీక్షా ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

Godavari River Pollution | కాలుష్య కారకాలు

అత్యాధునిక సాంకేతికతతో జరిపిన ఈ పరీక్షలలో, అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధిక రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ నివేదికపై తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

గోదావరి నదిని మురుగుమయం, రసాయనమయం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, కళ్ళ ముందే గోదావరి నది ఇంతలా కలుషితమవుతున్నా, ఇన్ని రోజులుగా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేశారని అధికారులను ప్రశ్నించారు.

అధికారులు చట్టపరంగా వాళ్లు చేయాల్సిన విధులను ఎందుకు నిర్వర్తించకుండా నిర్లక్ష్యం చేశారని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.

Godavari River Pollution | ఆందోళనకర స్థాయిలో కోలిఫామ్ బ్యాక్టీరియా

భక్తులు ఎంతో పవిత్రంగా భావించే రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో గోదావరి నది నీరు మురుగునీటి వల్ల తీవ్రంగా కలుషితమైందని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా ఆందోళనకరమైన నిజాలు బయటపడ్డాయి.

సాధారణంగా నది నీటిలో మనుషులు స్నానాలు చేయడానికి కోలిఫామ్ బ్యాక్టీరియా సంఖ్య 500 MPN/100ml లోపు ఉండాలి. కానీ, నల్లా ఛానల్ సమీపంలోని కోటిలింగాల ఘాట్ తీరంలో ఇది ఏకంగా 2420 MPN/100ml కి చేరింది.

నీటిలో కాలుష్యాన్ని చూపే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 3mg/L కంటే తక్కువ ఉండాలి. కానీ, ఇక్కడ అది 5.2 mg/L గా నమోదైంది. 73 శాతం పెరిగింది.

దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి చేపలు, జలచరాలు చనిపోతున్నాయి. నీటి స్వచ్ఛత గరిష్టంగా 5 NTU పాయింట్లు ఉండాలి. కానీ, పరీక్షల్లో ఇది 8.4 నుంచి 14.2 NTU వరకు వచ్చింది. మురుగునీరు కలవడం వల్ల గోదావరి నీరు పూర్తిగా రంగుమారిపోతోంది.

Godavari River Pollution | రసాయన ఎరువుల అవశేషాలు

మురుగు కాలువలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 250 mg/L దాటకూడదు. కానీ, ఇక్కడ 263 mg/L గా నమోదైంది. నీటిలో నైట్రేట్ పరిమితి 45 mg/L దాటకూడదు. కానీ, ఇక్కడ ఏకంగా 119.6 mg/L గా తేలింది. రసాయన ఎరువుల అవశేషాలు, ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవడం వల్లే నైట్రేట్లు ఇంతగా పెరిగాయి.

ఈ ల్యాబ్ నివేదిక ప్రకారం ఈ నీరు స్నానాలు చేయడానికి గానీ, గృహ అవసరాలకు గానీ ఏమాత్రం పనికిరాదు. ఈ నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా నైట్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందక బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ముప్పు ఉందని నివేదిక హెచ్చరించింది.

Godavari River Pollution | పరిమితికి మించి ప్రమాదకర రసాయనాలు

ఆంధ్ర పేపర్ మిల్లు లగూన్ వద్ద సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. నీటిలో సల్ఫైడ్, డివోబీ, ఫాస్ఫేట్లు పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడయ్యింది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 30 mg/L లోపు ఉండాలి.

కానీ, ఇక్కడ అది 36 mg/L ఉంది. 20 శాతం అధికంగా నమోదైంది. ఫ్యాక్టరీ వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్లే నీటిలో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోయి చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయి.

నీటిలో ఫాస్ఫేట్ పరిమితి 5 mg/L ఉండాల్సి ఉండగా.. ఇక్కడ 5.3 mg/L గా తేలింది. నీటిలో సల్ఫైడ్ పరిమితి 2 mg/L మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏకంగా 3.4 mg/L ఉన్నాయి. 70 శాతం అధికారంగా నమోదైంది.

ల్యాబ్ నివేదిక ప్రకారం ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న ఈ వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఈ నీటిని సరిగ్గా శుద్ధి చేయకుండా గృహ అవసరాలకు వాడటం మానవ ప్రాణాలకే అపాయమని నివేదిక హెచ్చరించింది.

Telangana Education Budget | కుర్చీలు మారినా.. క్లాస్​రూం తలరాత మారలే: బడ్జెట్​లో విద్యకు​ కేటాయింపులపై ప్రొఫెసర్ ఎంఏ​ మాలిక్​ విమర్శ

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *