NTR Bharat Ratna | ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు రాలేదు.. అస‌లు విష‌యం ఇది అంటూ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: NTR Bharat Ratna | విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు (N.T.Rama Rao)కు దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భార‌త‌ర‌త్న ఇప్పటికీ దక్కకపోవడంపై మరోసారి చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో వైసీపీ నేత ల‌క్ష్మీ పార్వ‌తి (Lakshmi Parvathi) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మీపార్వతి… ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడానికి అసలు కారణం తానేనని వెల్లడించారు. ఈ విషయాన్ని మాజీ ప్రధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా తనతో చెప్పారని పేర్కొన్నారు.

NTR Bharat Ratna | వాజ్‌పేయి చెప్పిన అసలు విషయం..

లక్ష్మీపార్వతి తెలిపిన వివరాల ప్రకారం… “ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని నేను చాలా ప్రయత్నించాను. అప్పటి ప్రధానులు దేవేగౌడ‌, గుజ్రాల్‌లను కలిశాను. వారు సానుకూలంగా స్పందించినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు” అని చెప్పారు. తర్వాత వాజ్‌పేయిని కలిసినప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ… మీరు ఎంత ప్రయత్నించినా ఎన్టీఆర్‌కు భారతరత్న రాదు. దానికి కారణం మీరే. ఆయనకు ఇచ్చే పురస్కారాన్ని మీరు స్వీకరించడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అందుకే వారు అడ్డుకుంటున్నారు’’ అని వాజ్‌పేయి చెప్పారని లక్ష్మీపార్వతి వెల్లడించారు.

NTR Bharat Ratna | కోటి సంతకాలు సేకరించి..

ఈ విషయంలో తెలుగుదేశంపై (Telugu Desam Party) కూడా లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు. ప్రతి సారి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానాలు చేసి, ఆ తర్వాత వాటిని అమలు చేయకుండా వదిలేయడం టీడీపీకి అలవాటైందని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించేందుకు తాను కోటి సంతకాలు సేకరించి అప్పటి రాష్ట్రపతి K.నారాయ‌ణ్‌కు సమర్పించానని తెలిపారు. అలాగే తన తండ్రికి ఈ గౌరవం దక్కేందుకు కృషి చేయాలని అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నంద‌మూరి హ‌రికృష్ణ‌ (Nandamuri Harikrishna)ను కూడా కోరినట్లు గుర్తుచేసుకున్నారు. ఏమైతేనేం ఎన్టీఆర్‌కు భారతరత్న అంశం మళ్లీ రాజకీయ చర్చకు దారి తీసింది. లక్ష్మీపార్వతి చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో మరింత వాదోపవాదాలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి..: Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *