Telangana Education Budget | కుర్చీలు మారినా.. క్లాస్​రూం తలరాత మారలే: బడ్జెట్​లో విద్యకు​ కేటాయింపులపై ప్రొఫెసర్ ఎంఏ​ మాలిక్​ విమర్శ

Naresh Chandan

అక్షరటుడే, హైదరాబాద్: Telangana Education Budget | “పాలకులు మారినా.. బడ్జెట్ రూపాలు మారినా.. విద్యా రంగానికి ఇచ్చే మొండిచేయి మాత్రం మారడం లేదు. కేసీఆర్ ఏలినా.. రేవంత్ రెడ్డి ఏలినా.. విద్యకు జరిగే అన్యాయంలో ఎలాంటి మార్పూ లేదు. కుర్చీలు మారడం తప్ప, క్లాస్‌రూమ్‌ల రాత మారడం లేదు” అని ప్రముఖ విద్యావేత్త, విశ్లేషకులు ప్రొఫెసర్ ఎం.ఏ. మాలిక్ ఘాటుగా విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర తాజా బడ్జెట్ కేటాయింపులు, విద్యా రంగంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులపై ప్రొఫెసర్ మాలిక్ లెక్కలతో సహా పాలకుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు.

Telangana Education Budget | సగటు ‘9.1%’ దాటని వైనం

గత మూడు బడ్జెట్లను ఒకసారి పరిశీలిస్తే.. విద్యా రంగానికి జరిగిన కేటాయింపుల శాతం ఇలా ఉంది:

బడ్జెట్ సంవత్సరం :– విద్యకు కేటాయింపులు (మొత్తం బడ్జెట్‌లో శాతం)

  • 2024-25 :– 8.6%
  • 2025-26 : – 9.0% (సుమారుగా)
  • 2026-27 : – 9.8%
  • గత 3 ఏళ్ల సగటు : – 9.13%

Telangana Education Budget | గత పాలనతో పోలిక

గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యపై సగటున 9.9% కేటాయింపులు జరిగాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో 15% ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం 9.1% సగటుతోనే సరిపెట్టింది. అంటే, పాత పాలకులకు, కొత్త పాలకులకు పెద్దగా తేడా ఏమీ లేదని స్పష్టం అవుతోంది.

Telangana Education Budget | తెలంగాణ వెనుకబాటు (National Average Comparison)

భారతదేశంలోని మిగతా రాష్ట్రాల సగటును పరిశీలిస్తే, చాలా రాష్ట్రాలు తమ మొత్తం బడ్జెట్‌లో విద్యా రంగానికి సగటున 13% నుంచి 15% వరకు కేటాయిస్తున్నాయి.

మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఛత్తీస్‌గఢ్ వంటివి కూడా తెలంగాణ కంటే ఎక్కువ శాతాన్ని విద్యకు కేటాయిస్తున్నాయి. పెద్ద రాష్ట్రాల జాబితాలో బడ్జెట్ పరంగా విద్యా రంగానికి అతి తక్కువ కేటాయింపులు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం దురదృష్టకరం.

Graduation Cap On Book Stack Education Concept Background Wallpaper Image For Free Download Pngtree

Telangana Education Budget | ఉచితాల జోరు – విద్య బేజారు

రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఉచిత పథకాలకు (Freebies) ఇచ్చే ప్రాధాన్యం, మానవ వనరుల అభివృద్ధిని పెంచే విద్య, వైద్య రంగాలకు ఇవ్వడం లేదు.

విద్యా రంగానికి చేసే కేటాయింపులను ప్రభుత్వాలు “ఖర్చు” (Expenditure) లాగా చూస్తున్నాయి తప్ప, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే “పెట్టుబడి” (Investment) లాగా చూడటం లేదు.

ఒక ఫ్లైఓవర్ కడితేనో లేదా ఒక ఉచిత పథకం ఇస్తేనో వెంటనే ఓట్లు వస్తాయనే ఆలోచన పాలకుల్లో ఉంటోందని, విద్యా వ్యవస్థ బాగుపడి ఫలితాలు రావడానికి పదేళ్లు పడుతుంది కాబట్టి దానిపై శ్రద్ధ చూపడం లేదనేది బహిరంగ రహస్యం.

IAS Gandham Chandrudu Story | రూ.ఐదు ‘లంచం’.. ఎండిన డొక్క.. ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడి ‘సర్టిఫికెట్ కథ’!

WhatsApp Image 2026 04 09 at 9.29.48 PM

Telangana Education Budget | అంతర్జాతీయ సిఫార్సులు ఎక్కడ?

ప్రపంచవ్యాప్తంగా జరిగిన విద్యా సదస్సులు, దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా కమిటీలు (కొఠారి కమిషన్ వంటివి) ఏకగ్రీవంగా ఒకే విషయాన్ని సిఫార్సు చేశాయి. రాష్ట్రాలు తమ మొత్తం బడ్జెట్‌లో కనీసం 20% నిధులను విద్యా రంగానికి కేటాయించాలి అని. కానీ, తెలంగాణలో ఆ సిఫార్సులో సగం కూడా దాటకపోవడం శోచనీయం.

తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ (TEC) స్వయంగా 18% నిధులు ఇవ్వాలని కోరినా.. ప్రభుత్వం మాత్రం సింగిల్ డిజిట్ (9.1%) కేటాయింపులతోనే చేతులు దులుపుకొంది.

Telangana Education Budget | ప్రజాప్రతినిధుల జీతాలకైతే లోటు లేదు!

“విద్యార్థులకు ఉచితంగా పాలు, రాగి మాల్ట్ ఇవ్వాలన్నా, గురుకులాలకు సొంత భవనాలు కట్టాలన్నా నిధుల కొరత సాకులు వినబడతాయి. కానీ ప్రజాప్రతినిధుల వేతనాలు, పెన్షన్లు, నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విషయానికి వస్తే బడ్జెట్ క్షణాల్లో సిద్ధమైపోతుంది. వారి సొంత ప్రయోజనాల కోసం ఏటా కోట్లాది రూపాయలు కేటాయించుకోవడానికి లేని నిధుల కొరత, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థుల విషయానికి వచ్చేసరికి ఎందుకు గుర్తొస్తుందో పాలకులకే తెలియాలి” అని విద్యావేత్తలు నిలదీస్తున్నారు.

Telangana Education Budget | విద్యను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే

బడ్జెట్‌లో విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సమాజం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు..

కనీస వసతుల కొరత: రాష్ట్రంలో వందలాది ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు ఇప్పటికీ కనీస మరుగుదొడ్లు, తాగునీరు, సొంత భవనాలు లేక అద్దె రూముల్లో మగ్గిపోతున్నాయి.

పెరుగుతున్న ప్రైవేట్ దోపిడీ: ప్రభుత్వ విద్య పడకేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి మరి ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది.

నాణ్యత లేని ఉన్నత విద్య: ఉస్మానియా వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలకు నిధులు అరకొరగా ఇవ్వడం వల్ల పరిశోధనలు, నాణ్యమైన విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.

ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాలకు కేటాయించే బడ్జెట్ కేవలం జీతాలకే సరిపోతోంది. పరిశోధనలకు (Research & Development), ల్యాబ్‌ల ఆధునీకరణకు, లైబ్రరీల అభివృద్ధికి నిధులు శూన్యం.

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో దాదాపు 60% పైగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్, పార్ట్-టైమ్ అధ్యాపకులతోనే బండి లాగిస్తున్నారు, ఇది విద్యా ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.

Creative Destruction Politi

Telangana Education Budget | పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..

ప్రొఫెసర్ మాలిక్ సూచనల ప్రకారం.. కేవలం ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే తక్షణమే పలు చర్యలు చేపట్టాలి.

  • బడ్జెట్ పెంపు: బడ్జెట్ కేటాయింపులను దశలవారీగా కాకుండా.. తక్షణమే కనీసం 15% – 18% కి పెంచాలి.
  • మౌలిక వసతుల కల్పన: అద్దె భవనాల్లో నడుస్తున్న 600కు పైగా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలి.
  • ఫీజుల నియంత్రణ: ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేలా కఠినమైన చట్టాలు తేవాలి.
  • ఖాళీల భర్తీ: పాఠశాలలు, డిగ్రీ, వర్సిటీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న టీచర్, ప్రొఫెసర్ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలి.

రాజకీయ నాయకులు తమ వేతనాలు, పెన్షన్లపై చూపే శ్రద్ధలో పదో వంతైనా విద్యా రంగంపై చూపిస్తేనే.. తెలంగాణ సమాజం, రాబోయే తరాల భవిష్యత్తు బాగుపడుతుందని, లేదంటే ‘రావు గారు ఉన్నా.. రెడ్డి గారు వచ్చినా’ విద్యా వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
11 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *