అక్షరటుడే వెబ్‌డెస్క్: Lam Research Skill Training | సెమీకండక్టర్ తయారీ పరికరాలు, టెక్నాలజీ పరిష్కారాల్లో అగ్రగామి సంస్థ అయిన ‘లామ్ రీసెర్చ్’ మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా భారత్‌లో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందిస్తూ, అధునాతన తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
Lam Research Skill Training | నైపుణ్య శిక్షణ..
దేశంలో ఎలక్ట్రానిక్స్ ( Electronics ) , ఏరోస్పేస్, సెమీకండక్టర్ పరికరాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు), వైద్య పరికరాల తయారీ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తయారీ రంగానికి అవసరమైన నిపుణులను తయారు చేయాలని లామ్ రీసెర్చ్ భావించింది. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం బెంగళూరులో మే 2026లో ప్రారంభమైంది. ప్రస్తుతం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియతో పాటు శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
Lam Research Skill Training | శిక్షణ వివరాలు ..
ఈ కార్యక్రమం క్యాపిటల్ గూడ్స్ స్కిల్ కౌన్సిల్ పరిధిలో, ఎన్‌ఎస్‌క్యూఎఫ్ స్థాయి-3 ప్రమాణాలకు అనుగుణంగా సాగుతుంది. అసెంబ్లీ లైన్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా 240 గంటల సమగ్ర శిక్షణను భాగస్వామి సంస్థ అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్, యాంత్రిక పరికరాల అమరిక, ఉత్పత్తి ప్రక్రియలు, నాణ్యతా ప్రమాణాలు, భద్రత, కార్యాలయ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌డీసీ) గుర్తింపుతో సర్టిఫికెట్ అందజేస్తారు. అలాగే ఉద్యోగ నియామకాల్లోనూ సహాయం అందిస్తారు.
Lam Research Skill Training | స్థానిక ప్రతిభకు పెద్దపీట..
స్థానిక ప్రతిభలో పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక రంగాల తయారీ విభాగాల్లో యువత రాణించేలా తీర్చిదిద్దుతున్నామని లామ్ రీసెర్చ్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రంగేష్ రాఘవన్ తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఐఐఎస్‌సీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్‌తో కలిసి ‘సెమీవర్స్’ సొల్యూషన్స్ ద్వారా విద్యార్థులకు వర్చువల్ సెమీకండక్టర్ తయారీ అభ్యాసాన్ని అందిస్తున్నామని సంస్థ గుర్తుచేసింది.
ఇది కూడా చదవండి: Sneha Society Services | స్నేహా సొసైటీ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి