అక్షరటుడే వెబ్‌డెస్క్: Ferro Alloys Industry | భారతదేశంలో ( India )శరవేగంగా విస్తరిస్తున్న స్టీల్ పరిశ్రమ నేపథ్యంలో, దేశీయ ఫెర్రో-అలాయ్స్ రంగానికి అపూర్వ వృద్ధి అవకాశాలు లభిస్తున్నాయని, గ్లోబల్ మార్కెట్‌లో దేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చని ఇండియన్ ఫెర్రో అల్లాయ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IFAPA) వెల్లడించింది. గోవా వేదికగా “Fueling India’s Steel Surge: The Rising Importance of Ferro Alloys” అనే థీమ్‌తో 6వ అంతర్జాతీయ ఫెర్రో అలాయ్స్ సదస్సు (IFAC 2026) ప్రారంభమైంది.
Ferro Alloys Industry | స్టీల్ రంగంలో గణనీయ వృద్ధి..
దేశంలో క్రూడ్ స్టీల్ ఉత్పత్తి 2025 నాటికి సుమారు 165 మిలియన్ టన్నులకు చేరి, పది శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. తలసరి స్టీల్ వినియోగం కూడా గతంలో 24 కిలోలుగా ఉంటే, ఇప్పుడు 109 కిలోలకు పెరిగింది. రాబోయే రోజుల్లో 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వృద్ధి కారణంగా మాంగనీస్, క్రోమియం, సిలికాన్ వంటి ఫెర్రో-అలాయ్ ఇన్‌పుట్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. బిగ్‌మింట్ గణాంకాల ప్రకారం, సిలికో-మాంగనీస్ , ఫెర్రో-మాంగనీస్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా, 2025లో భారత్ ప్రపంచంలోనే మాంగనీస్ అలాయ్స్‌కు అగ్రగామి ఎగుమతిదారుగా నిలిచింది.
Ferro Alloys Industry | ఐఎఫ్‌ఏపీఏ ప్రత్యేక దృష్టి..
ఫెర్రో-అలాయ్ ఉత్పత్తిలో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలంటే దేశీయంగా కీలక ఖనిజాల అన్వేషణ, గనుల అభివృద్ధిని వేగవంతం చేయాలని ఐఎఫ్‌ఏపీఏ చైర్మన్ మనీష్ సర్దా అభిప్రాయపడ్డారు. గనుల వేలం విధానాలు కేవలం అత్యధిక బిడ్‌లకే కాకుండా, వాస్తవిక ఉత్పత్తిని ప్రోత్సహించేలా మారాలని సూచించారు. దేశీయంగా ముడిసరుకు అందుబాటులో లేకపోవడంతో 2026 మొదటి అర్ధభాగంలో మాంగనీస్ ఓర్ దిగుమతులు 27 శాతం పెరిగి 4.03 మిలియన్ టన్నులకు చేరాయని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి స్వదేశీ వనరుల లభ్యత ఎంతో కీలకమని స్పష్టం చేశారు.
Ferro Alloys Industry | ప్రధాన అంశాలు..
దేశీయంగా తగిన గ్రేడ్లు లభించని చోట మాంగనీస్ ఓర్ , నోబుల్ అలాయ్స్ దిగుమతులపై సుంకాలను తొలగించాలని పరిశ్రమ కోరుతోంది. విద్యుత్ వినియోగం అధికంగా ఉండే ఈ పరిశ్రమకు పోటీతత్వంతో కూడిన విద్యుత్ ధరలు, ఛార్జీల హేతుబద్ధీకరణ అవసరమని అసోసియేషన్ తెలిపింది. ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులు, 35 మంది వక్తలు పాల్గొని మాంగనీస్ భద్రత, గ్లోబల్ ట్రేడ్, ఇంధన సామర్థ్యం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. 1961లో ఏర్పాటైన ఐఎఫ్‌ఏపీఏ గత 64 సంవత్సరాలుగా ఫెర్రో అలాయ్స్ పరిశ్రమకు అపెక్స్ బాడీగా సేవలందిస్తోంది.
ఇది కూడా చదవండి: Kamareddy Railway Station | కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిశీలించిన రైల్వే జీఎం