అక్షరటుడే వెబ్‌డెస్క్: Shruti Haasan Deepfake | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి సృష్టించిన నకిలీ, అశ్లీల వీడియోలపై నటి శృతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా కీలక తీర్పు వెలువడింది. ఇంటర్నెట్‌లో ఆమెకు సంబంధించిన ఆ తప్పుడు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా దిగ్గజాలను ఆదేశించింది.
Shruti Haasan Deepfake | అసలేం జరిగిందంటే..
గత జూన్ నెలలో కొంతమంది కేటుగాళ్లు శృతి హాసన్ ముఖాన్ని అభ్యకరమైన వీడియోలకు మార్ఫింగ్ చేయడమే కాకుండా, ఆమె అనుమతి లేకుండా నకిలీ అకౌంట్ల ద్వారా వస్తువుల అమ్మకాలు, బ్రాండ్ ప్రమోషన్లు కూడా నిర్వహించారు. తన పరువుకు భంగం కలిగిస్తూ, వ్యక్తిగత గౌరవానికి మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ శృతి హాసన్ ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తన ప్రతిష్టకు జరిగిన నష్టానికి రూ.15 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు.
Shruti Haasan Deepfake | హైకోర్టు స్పందన..
ఈ కేసును విచారించిన జస్టిస్ మాధవ్ జామదార్.. నటి లేవనెత్తిన అంశాల్లోని న్యాయాన్ని సమర్థించారు. ఇంటర్నెట్‌లో ఇలాంటి నకిలీ కంటెంట్ కొనసాగితే ఆమె ప్రతిష్టకు పూడ్చలేని పెద్ద నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక నష్టపరిహారం ఇవ్వడం ద్వారా ఈ పరువు నష్టాన్ని సరిదిద్దలేమని, సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యత, గౌరవం అనేవి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయని కోర్టు గుర్తుచేసింది.
ఈ నేపథ్యంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు శృతి హాసన్ గుర్తించిన నకిలీ లింకులు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశించింది. అలాగే ఆ నకిలీ అకౌంట్లు నడుపుతున్న అజ్ఞాత వ్యక్తుల వివరాలను బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. నేటి డిజిటల్ యుగంలో ఏఐ దుర్వినియోగం పెరుగుతున్న తరుణంలో సెలబ్రిటీల భద్రతకు ఈ తీర్పు పెద్ద ఊరటగా నిలిచింది.
ఇది కూడా చదవండి: ESDS Software Solutions IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. తొలిరోజే రెట్టింపైన పెట్టుబడి