అక్షరటుడే వెబ్‌డెస్క్: Supreme Court Doctors | వైద్యులపై రాజకీయ పార్టీల నేతలు మరియు కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో ( Maharashtra )డాక్టర్లపై దాడికి పాల్పడే ఏ రాజకీయ నేతనైనా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాంటి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వేచ్ఛగా తిరగనివ్వొద్దని స్పష్టం చేసింది. కళ్యాణ్‌లోని శాస్త్రినగర్ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన కేసులో శివసేన కౌన్సిలర్ రమేశ్ మ్హాత్రే బెయిల్ షరతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Supreme Court Doctors |అసలు ఏం జరిగింది?
మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో దహీ హండి ఉత్సవాల సమయంలో గాయపడిన ఒక వ్యక్తిని డిశ్చార్జ్ చేసే విషయంలో ఆసుపత్రి సిబ్బందితో వివాదం చెలరేగింది. శాస్త్రినగర్ ఆసుపత్రి కారిడార్‌లో మొదలైన ఈ గొడవ క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 17 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతలు కూడా ఉన్నారు. సీసీటీవీ फुటేజీలో ఓ నిందితుడు రిసెప్షనిస్ట్‌ను చెంపదెబ్బ కొట్టినట్లు, అడ్డుబోయిన మహిళా ఉద్యోగిని బెదిరించినట్లు రికార్డైంది. శివసేన జిల్లా అధ్యక్షుడు కుందన్ సాంకే, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరత్ తదితరులు అత్యవసర విభాగంలోకి బలవంతంగా ప్రవేశించి వైద్యులతో వాగ్వాదానికి దిగి, సిబ్బందిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Supreme Court Doctors | బెయిల్ రద్దు కోరిన ప్రభుత్వం..
ఈ కేసులో నిందితుడైన కౌన్సిలర్ రమేశ్ మ్హాత్రే తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించినప్పటికీ, ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు, నిందితుడికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది.
Supreme Court Doctors | తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదు..
ఆసుపత్రుల్లో ప్రాణాలు కాపాడే వైద్య నిపుణులపై దాడులు జరగడాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. రాజకీయ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దాడులకు తెగబడుతున్న తీరుపై మండిపడిన కోర్టు.. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించి, బాధ్యులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Tata Madhu Dismissal | తాతా మధును డిస్మిస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి