అక్షరటుడే వెబ్‌డెస్క్: Srisailam Left Bank Power Plant | నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలోని తెలంగాణ ( Telangana )శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో సుమారు ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న 4వ యూనిట్ ఎట్టకేలకు మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఈ నెల 10న ఈ యూనిట్‌ను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Srisailam Left Bank Power Plant | ఏం జరిగిందంటే..
2020 ఆగస్టు 20న శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 4వ యూనిట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో 9 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తి నష్టం వాటిల్లింది. బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు.
Srisailam Left Bank Power Plant | రూ.25 కోట్లతో మరమ్మతులు..
ప్రమాదం కారణంగా నిలిచిపోయిన 4వ యూనిట్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీకి చెందిన ‘వాయిత్’ కంపెనీకి సుమారు రూ.25 కోట్లు కేటాయించి కీలక మరమ్మతులు పూర్తి చేయించారు. 2023, 2025 సంవత్సరాల్లో మరమ్మతుల అనంతరం యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు అన్ని పరీక్షలు విజయవంతం కావడంతో, ఈ నెల 10న దీనిని గ్రిడ్‌కు అనుసంధానించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు జెన్కో ఎస్‌ఈ ఆదినారాయణ తెలిపారు.
Srisailam Left Bank Power Plant |పెరగనున్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం..
ఈ 4వ యూనిట్ అందుబాటులోకి రావడంతో శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం పూర్తి స్థాయికి చేరనుంది. ఇక్కడ మొత్తం ఆరు యూనిట్లు ఉండగా, నాలుగో యూనిట్ కూడా కలిపితే మొత్తం 900 మెగావాట్ల (ప్రతి యూనిట్‌కు 150 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఇది రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు ప్రభుత్వానికి మరింత వెసులుబాటు కల్పించనుంది.
ఇది కూడా చదవండి: Mittapalli Temple | మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు