Diabetes Family History | తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఒకప్పుడు మధుమేహం (డయాబెటిస్) సమస్య కేవలం 50 ఏళ్లు దాటిన వారికే ఎక్కువగా వచ్చేది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Diabetes Family History | ఒకప్పుడు మధుమేహం (డయాబెటిస్) సమస్య కేవలం 50 ఏళ్లు దాటిన వారికే ఎక్కువగా వచ్చేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు 25 నుంచి 30 ఏళ్ల యువతలోనూ ఈ వ్యాధి కనిపిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో చాలా మందిలో ఒక సాధారణ సందేహం మెదులుతుంటుంది. అమ్మానాన్నల్లో ఎవరికైనా షుగర్ ఉంటే, కచ్చితంగా తమకూ వస్తుందా? అనే భయం చాలామందిని వేధిస్తుంటుంది. అయితే, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నంత మాత్రాన వ్యాధి పక్కాగా వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని, కాకపోతే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Diabetes Family History | రెండు రకాల డయాబెటిస్..

మధుమేహంలో ప్రధానంగా టైప్-1, టైప్-2 అనే రెండు రకాలు ఉంటాయి. టైప్-1 డయాబెటిస్ సాధారణంగా జన్మతః వస్తుంది. ఇందులో శరీరం ఇన్సులిన్‌ను అసలు ఉత్పత్తి చేయలేదు. దాంతో బాధితులు జీవితాంతం ఇన్సులిన్‌పైనే ( Insulin ) ఆధారపడాల్సి వస్తుంది. అయితే టైప్-1 ఉన్న ప్రతి ఒక్కరికీ కుటుంబంలో షుగర్ హిస్టరీ ఉండాల్సిన పనిలేదు. ఇక మనం సమాజంలో ఎక్కువగా చూసేది టైప్-2 డయాబెటిస్. తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ సమస్య ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అమ్మానాన్న ఇద్దరికీ షుగర్ ఉంటే మాత్రం పిల్లలకు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. అయితే దీనికి కేవలం జన్యుపరమైన కారణాలే కాకుండా.. శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, ఊబకాయం (అధిక బరువు) కూడా ప్రధాన కారణాలే.

Diabetes Family History | కంట్రోల్ చేయొచ్చు..

కుటుంబంలో షుగర్ వ్యాధి ఉందంటే తప్పకుండా రావాలని నిబంధన ఏమీ లేదు. సరైన జీవనశైలితో దీన్ని సులభంగా అడ్డుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం, జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా టైప్-2 డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ వ్యాధి లక్షణాలు ప్రారంభమైనా, ఈ నియమాలు పాటిస్తే దానిని రివర్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

Diabetes Family History జాగ్రత్తలు..

తల్లిదండ్రులకు మధుమేహం ఉందనే కారణంతో అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కాకపోతే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. కుటుంబంలో షుగర్ హిస్టరీ ఉన్నవారు తరచూ షుగర్ లెవెల్స్ పరీక్షలు (బ్లడ్ టెస్టులు) చేయించుకోవడం ద్వారా ముందస్తుగా అప్రమత్తం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  Wild Boar Accident | అడవి పంది అడ్డు రావడంతో.. కింద పడి ఒకరి మృతి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *