అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Telegram Scam | పార్ట్‌టైమ్ ఉద్యోగం, భారీ లాభాల పేరుతో సైబర్ నేరగాళ్లు మరో గృహిణిని మోసగించారు. హోటళ్లకు ఆన్లైన్ రివ్యూలు ఇచ్చే పనులంటూ నమ్మించి, సుమారు రూ. 6 లక్షలకు పైగా నగదు కాజేశారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ వారాసిగూడ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల మహిళ ఈ సైబర్ మోసానికి బలయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Hyderabad Telegram Scam | టెలిగ్రామ్ మెసేజ్‌తో ..
సెప్టెంబర్ 9న బాధితురాలికి టెలిగ్రామ్ ( Telegram )ద్వారా ‘పూజా’ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్‌లు, ఫీడ్‌బ్యాక్ ఇస్తే డబ్బులు వస్తాయని ఆశచూపి, ఆమెను ‘BVLGARI 5471’ అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చారు. ప్రారంభంలో నమ్మకం కలిగించేందుకు కొన్ని టాస్కులు చేయించారు. మొదట 30 రివ్యూలు పూర్తి చేయగానే ఆమె ఖాతాలో రూ. 720 జమ చేశారు. ఆ తర్వాత అదనపు టాస్కుల పేరుతో రూ. 10 వేలు పెట్టుబడి పెట్టించి, అసలుతో పాటు లాభం కలిపి రూ. 16,434 తిరిగి ఇచ్చారు.
Hyderabad Telegram Scam | నమ్మకం కుదిరాక ..
బాధితురాలికి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత కేటుగాళ్లు తమ అసలు రూపం చూపించారు. వీఐపీ లెవెల్స్ టాస్క్ పేరుతో మరో రూ. 20 వేలు కట్టించుకుని రూ. 39,810 చెల్లించారు. ఆ తర్వాత సంస్థ వార్షికోత్సవం ఆఫర్ అంటూ రెచ్చిపోయారు. రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే ఏకంగా రూ. 10 లక్షలు వస్తాయని ఆశ చూపించారు. ఇది నిజమని నమ్మిన ఆ మహిళ వారు చెప్పిన ఖాతాలకు నగదు బదిలీ చేసింది.
Hyderabad Telegram Scam | డబ్బులు రాకపోయేసరికి ..
డబ్బులు కట్టిన తర్వాత మిస్టరీ బాక్స్ ఓపెన్ అయిందని, మీకు రూ. 12 లక్షలు వచ్చాయని నమ్మబలికారు. అయితే ఆ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే అదనంగా పన్నులు, చార్జీలు చెల్లించాలంటూ మరింత డబ్బు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన ఆమె విడతల వారీగా మొత్తం రూ. 6,23,232 వరకు చెల్లించినా ఎలాంటి డబ్బు వెనక్కి రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ జి. సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gadpotaram Gas Leak | గడ్డపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి