Wayanad Poster Controversy| వాయనాడ్‌లో పొలిటికల్ హీట్.. రాహుల్, ప్రియాంక, ఖర్గేలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టర్లు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Wayanad Poster Controversy|కేరళలోని వాయనాడ్ రాజకీయాల్లో పోస్టర్ల కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ జిల్లా కార్యాలయం (DCC) ప్రహరీ గోడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి. “వాయనాడ్ నియోజకవర్గం తదుపరి అమేథీగా మారబోతోంది” అంటూ ఆ పోస్టర్లలో హెచ్చరించడం స్థానికంగా తీవ్ర సంచలనమైంది. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఓటమిని ప్రస్తావిస్తూ ఈ పోస్టర్లను ముద్రించారు. వాయనాడ్ ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీని టార్గెట్ చేస్తూ ఇవి వెలిశాయి.

Wayanad Poster Controversy|రంగంలోకి దిగిన పోలీసులు..

గోడలపై వివాదాస్పద పోస్టర్లను గమనించిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు వాటిని తొలగించాయి. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. సిద్ధిక్ కల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు కేరళ పోలీస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Wayanad Poster Controversy|సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు..

కేరళలో తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఉధృతంగా ఉన్న తరుణంలో మే 13న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈ పోస్టర్లను అంటిస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్, ప్రస్తుతం ప్రియాంక గాంధీ నియోజకవర్గంగా ఉండటంతో ఈ పోస్టర్ల వ్యవహారం కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Hormuz Strait attacks | నౌకలపై దాడులను ఖండించిన భారత్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *