Ahmedabad Blasts Verdict | అహ్మదాబాద్​ పేలుళ్ల కేసుల్లో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష

గుజరాత్​ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008 అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Blasts Verdict | గుజరాత్​ హైకోర్టు (Gujarat High Court) సంచలన తీర్పు వెలువరించింది. 2008 అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది.

గుజరాత్​లోని అహ్మదాబాద్​లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఈ పేలుళ్లలో 56 మంది మరణించగా, 246 మంది గాయపడ్డారు. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, సాధారణ గాయాలకు రూ.1 లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చెల్లింపును 2027 మార్చి 31లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Ahmedabad Blasts Verdict | వరుస పేలుళ్లు..

అహ్మదాబాద్​లో 2008 జూలై 26న పలు పేలుళ్లు జరగ్గా, రెండు రోజుల తర్వాత సూరత్‌లో బాంబులు లభ్యమయ్యాయి. సివిల్ ఆసుపత్రి, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎల్‌జీ ఆసుపత్రితో పాటు బస్సులు, పార్క్ చేసిన సైకిళ్లు, కార్లు, ఇతర ప్రదేశాలలో మొత్తం 22 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 56 మంది మరణించగా, సుమారు 200 మంది గాయపడ్డారు. నగర క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో ఈ నేరానికి సంబంధించి 100 మందికి పైగా నిందితులుగా పేర్కొనగా, 78 మందిపై విచారణ చేపట్టారు.

Ahmedabad Blasts Verdict | 49 మంది దోషులుగా..

ఈ పేలుళ్లపై 2022 ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా నిర్ధారించి, మరో 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. కుట్ర పన్నారని, బెదిరింపు మెయిల్స్ పంపారని, ఉగ్రదాడికి తామే బాధ్యులమని ప్రకటించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న ముబిన్ షేక్, మన్సూర్ పిర్భోయ్‌లు నిర్దోషులుగా విడుదలయ్యారు. 2022లో విచారణ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపైజస్టిస్ ఎ.వై. కోగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తాజాగా తీర్పు వెలువరించింది.

Ahmedabad Blasts Verdict | నిందితుల్లో హైదరాబాద్​ వాసి

మరణశిక్ష పడిన వారిలో 13 మంది గుజరాత్‌కు చెందినవారు కాగా, ఉత్తరప్రదేశ్ నుండి ఎనిమిది మంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి ఐదుగురు చొప్పున, కేరళ, కర్ణాటక నుండి ఇద్దరు చొప్పున ఉన్నారు. హైదరాబాద్​కు చెందిన ఒకరికి సైతం ఉరిశిక్ష పడింది. గుజరాత్‌లో 2002 గోధ్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగా, ప్రభుత్వాన్ని కూలదోయడానికి నిందితులు ఈ వరుస పేలుళ్లకు ప్రణాళిక రచించారని ప్రాసిక్యూషన్ వాదించింది.

ఇది కూడా చదవండి..: Manipur Assam Rifles | మణిపూర్‌లో ఉగ్రదాడి.. అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్ల దుర్మరణం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *