అక్షరటుడే వెబ్‌డెస్క్Telangana Paddy Crisis| తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న తీవ్ర సంక్షోభం, కొనుగోలు కేంద్రాల వద్ద రైతాంగం పడుతున్న నరకయాతనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒక సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. గత రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వానికి కనీస సోయి లేకపోవడంపై నిప్పులు చెరిగారు. ఎల్లుండి (మే 23) జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్నదాతలకు తక్షణమే న్యాయం చేయాలని కేటీఆర్ గట్టిగా డిమాండ్ చేశారు.
Telangana Paddy Crisis|అన్నదాతల వెన్నువిరిచిన కాంగ్రెస్ పాలన..
గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ హయాంలో కొండంత ఆత్మవిశ్వాసంతో గుండె నిబ్బరంగా బతికిన తెలంగాణ రైతు.. నేడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాల సకల కష్టాలు తీరిపోయాయని సంబరంగా సాగు చేసుకుంటున్న రైతు నోట్లో ఈ సర్కార్ మట్టి కొట్టిందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ రైతులకు రక్షణగా అమలు చేసిన ఒక్కో అద్భుత పథకానికి ఈ ముప్పై నెలల కాలంలో పాతరేసి, తమ చేతకానితనంతో అన్నదాతల వెన్నువిరిచారని మండిపడ్డారు.
Telangana Paddy Crisis|ఢిల్లీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన పరాకాష్టకు చేరిందని, కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఆర్తనాదాలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అసమర్థ సర్కార్ నిర్వాకం వల్లే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఏ మూల చూసినా రైతులు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో రోడ్లపైకి వస్తున్నారని ఆరోపించారు. సీఎం కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోయడంపై, 70 సార్లు అక్కడ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధలో ఒక్క శాతం కూడా రైతులపై పెట్టలేదని, అందుకే ఈ దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు.
Telangana Paddy Crisis|కాలిబూడిదవుతున్న ధాన్యం ..
రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు పడలేక, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు పదిమంది రైతులు వడదెబ్బకు, సర్కారు చేసిన ద్రోహానికి గుండె పగిలి కన్నుమూశారని కేటీఆర్ లేఖలో ఆరోపించారు. అయినా సీఎం గానీ, మంత్రులు గానీ ఏ ఒక్క కేంద్రం వైపూ కన్నెత్తి చూడలేదన్నారు. విసిగిపోయిన రైతులు తాము కంటికి రెప్పలా పెంచిన పంటను రోడ్లపై తమ చేతులతోనే తగలబెట్టుకుంటున్నారని.. కాలిబూడిదవుతున్న ఆ ధాన్యం కుప్పలే ఈ ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలని పేర్కొన్నారు. పెట్టుబడి సాయాన్ని వరుసగా నాలుగు సార్లు ఎగ్గొట్టి, యూరియా కోసం కష్టాల పాలు చేసినా రైతులు భరించారని, కానీ పంటను కూడా కొనకపోవడం దారుణమన్నారు. పగలూ రాత్రి ప్రజాసంపదను దోచుకోవడంపై ఉన్న పట్టు.. పరిపాలనపై రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.
Telangana Paddy Crisis|సొంత నియోజకవర్గంలోనూ నిరసనల సెగ..
భూములను అమ్మి వేల కోట్లు వెనకేసుకోవాలన్న ఉత్సాహం తప్ప పంటలు కొనాలన్న ధ్యాస ప్రభుత్వంలో లేదని కేటీఆర్ మండిపడ్డారు. రోడ్లపై రైతులు రోదిస్తుంటే మంత్రులు హెలికాప్టర్లలో షికార్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చివరికి సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోస్తున్నారంటే సాగు సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వరంగల్ నుంచి ఖమ్మం దాకా అనేక జిల్లాల్లో రోజుకు కనీసం ఒక్క లారీ లోడ్ కూడా ధాన్యం ఎత్తడం లేదని విమర్శించారు.
Telangana Paddy Crisis|ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి..
అడపా దడపా చేసే కొనుగోళ్లలోనూ క్వింటాలుకు 10 కిలోలకు పైగా ‘తరుగు’ పేరిట కటింగ్ పెడుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. చివరికి గన్నీ బ్యాగుల (గోనె సంచులు) కోసం రైతులు ఒక్కొక్కరు రూ.50 చొప్పున డిపాజిట్ చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇచ్చే ముఖం ఎలాగూ లేదని, కనీసం మద్దతు ధర ఇచ్చి పంటను కూడా కొనడం చేతకాకపోతే రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు పడిగాపులు పడుతుంటే.. ప్రభుత్వం పర్యాటక వారోత్సవాలు జరపడం వారి ప్రాధాన్యతల లేమికి, సోయి లేకపోవడానికి నిదర్శనమన్నారు.
Telangana Paddy Crisis|కేసీఆర్ పాలనను గుర్తుచేస్తూ..
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట చేతికి రావడానికి మూడు నెలల ముందే పకడ్బందీ ప్రణాళికలు వేసేవారని, గోనె సంచులు లభ్యత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడేదాకా నిరంతరం సమీక్షలు చేసేవారని కేటీఆర్ గుర్తుచేశారు. కరోనా లాంటి విపత్కర కాలంలోనూ కొనుగోలు కేంద్రాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకు కొని రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపారన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేకపోవడం వల్ల, అకాల వర్షాలకు కళ్లముందే పంట కొట్టుకుపోతుంటే రైతులు నిస్సహాయంగా ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Paddy Crisis|రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..
ఈ కాంగ్రెస్ పాపానికి ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహానికి గురైన ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. మే 23న జరిగే కేబినెట్ మీటింగ్‌లోనైనా ప్రభుత్వం లెంపలేసుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యమంతటినీ వెంటనే కొని పైసలు జారీ చేయాలన్నారు. అలాగే, కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున తక్షణ పరిహారం ప్రకటించాలని, లేనిపక్షంలో చరిత్రలో రేవంత్‌రెడ్డి ఎప్పటికీ ‘రైతు ద్రోహి’గానే మిగిలిపోతారని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు.
ఎన్నాళ్లీ మొద్దు నిద్ర ముఖ్యమంత్రి
పంట కొనుగోళ్ల సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
క్యాబినెట్ మీటింగ్ లోనైనా కళ్ళు తెరవండి
రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా..?
కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా ?
ధ్యానం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా ?… pic.twitter.com/NJuVqyiioh
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2026
ఇది కూడా చదవండి: YS Jagan Comments | కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. జగన్ సంచలన వ్యాఖ్యలు


