అక్షరటుడే వెబ్‌డెస్క్: Karnataka CM Change | కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి మార్పుపై అధిష్టానం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, రేపు (గురువారం) సీఎం సిద్ధరామయ్య ( siddaramaiah) తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Karnataka CM Change |రాహుల్ గాంధీ సరికొత్త వ్యూహం..
సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించడంతో పాటు, మంత్రివర్గాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘కేరళ మోడల్’ను తెరపైకి తెచ్చారు. ఇటీవల కేరళలో యూత్ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న యువ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చినట్లుగానే.. కర్ణాటకలోనూ రాబోయే 2028 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త వారికి కేబినెట్‌లో పెద్దపీట వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత మంత్రివర్గంలోని దాదాపు 25 మంది మంత్రులను తొలగించి, వారికి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Karnataka CM Change | సామాజిక న్యాయం..
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించడం రాహుల్ గాంధీ ‘సామాజిక న్యాయం’ నినాదానికి కొంత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కొత్త కేబినెట్‌లో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు భారీగా అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. తద్వారా సిద్ధరామయ్యకు బలమైన మద్దతుగా ఉన్న ‘అహిందా’ (దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల కూటమి) ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దూరం కాకుండా చూసుకోవాలనేది హైకమాండ్ ఎత్తుగడగా కనిపిస్తోంది.

Karnataka CM Change | ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రతిపాదన..
కొత్త ప్రభుత్వం కొలువుదీరితే రాష్ట్రంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను (Deputy CMs) నియమించాలనే డిమాండ్‌ను సిద్ధరామయ్య వర్గం బలంగా వినిపిస్తోంది. ఇందులో ఒక డిప్యూటీ సీఎం పదవిని దళిత సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు. కర్ణాటక చరిత్రలో ఇప్పటివరకు దళిత ముఖ్యమంత్రి లేని లోటును ఈ పదవి ద్వారా భర్తీ చేసి ఆ సామాజిక వర్గానికి సానుకూల సందేశం పంపాలని చూస్తున్నారు. అయితే, ఒకరి కంటే ఎక్కువ డిప్యూటీ సీఎంలు ఉండటాన్ని డీకే శివకుమార్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌లో ఏం జరగబోతోందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ED Raids Telangana | హైదరాబాద్, కరీంనగర్‌లో ఒకేసారి ఈడీ సోదాలు


