అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dowry Car Dispute | కట్నం కింద ఇస్తానన్న కారు కోసం ఓ పోలీస్ అధికారి తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు. పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు మారుతి బ్రెజ్జా కారుకు బదులుగా హ్యుందాయ్ కారు ఇస్తామనడంతో పెళ్లికి నిరాకరించి తన కుటుంబంతో కలిసి తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో ఈ నెల 20న చోటు చేసుకుంది.
వధువు తండ్రి సుభాష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరుడు కుల్‌దీప్ ఢిల్లీ పోలీసు (Delhi Police) విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తనకు సుమారు రూ. 9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారుకు బదులుగా, రూ. 13 లక్షల విలువైన మారుతి బ్రెజ్జా కారు కావాలని పట్టుబట్టాడు. అయితే పెళ్లి కూతురు తరఫు వారు ఇప్పటికే హ్యుందాయ్ కారును బుక్ చేశారు. వివాహానికి ఒక రోజు ముందు, ఆ కారు నచ్చలేదని, దానికి బదులుగా మారుతి బ్రెజ్జా కావాలని కుల్‌దీప్ కోరినట్లు మధ్యవర్తుల ద్వారా తెలిసిందని చెప్పారు. దీంతో ఆ కారు బుకింగ్ కోసం ప్రయత్నించినా.. వివాహ సమయం దగ్గరపడటంతో వీలు కాలేదన్నారు.
Dowry Car Dispute | పోలీసులకు ఫిర్యాదు
కేవలం కారు (Dowry Car Dispute ) మాత్రమే కాకుండా పెళ్లి కొడుకు మరికొన్ని డిమాండ్లు సైతం చేశాడు. అతడికి రెండు తులాల బంగారు గొలుసు, అతని తల్లికి నాలుగు తులాల బంగారు చెవిపోగులు ఇచ్చేందుకు తాము అంగీకరించామన్నారు. వరుడి అన్నయ్య, వదినలకు కూడా నగలు కావాలని డిమాండ్ చేయడంతో వాటికి సైతం ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. తీరా పెళ్లి రోజు అందరు అతిథులు వచ్చాక.. వరుడు కుల్‌దీప్ బ్రెజా కారు కావాలని పెళ్లి రద్దు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎంత బతిమాలిన వినకుండా వెళ్లిపోయాడన్నారు. ఈ ఘటనపై ఇరు పక్షాలు డయల్ 112 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అనంతరం వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి, వరుడిపై మరియు అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరారు. వివాహ ఏర్పాట్ల కోసం తాను సుమారు రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేశానని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Paddy Farmers | వ్యవసాయ అధికారుల తప్పిదం.. రైతుల పాట్లు