Hyderabad Child Murder | రెండో పెళ్లికి అడ్డని.. ఆరేళ్ల చిన్నారిని కడతేర్చిన కసాయి తల్లి

Shivam nagarani

అక్ష్రరటుడే వెబ్‌డెస్క్:Hyderabad Child Murder | కన్నప్రేమ కనుమరుగైంది.. స్వార్థం ముందు పేగు బంధం ఓడిపోయింది. నవమాసాలు మోసి, లాలించి పాలించాల్సిన కన్నతల్లే కాలయముడిగా మారిన హృదయ విదారక ఘటన హైదరాబాద్‌ అల్వాల్‌లో వెలుగుచూసింది. ప్రియుడి మోజులో పడి, తన సుఖం కోసం ఆరేళ్ల పసిప్రాణాన్ని వాటర్ ట్యాంకులో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది. లోకం తెలియని ఆ చిన్నారిని  కనికరించకుండా కడతేర్చిన ఈ దారుణం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.

Hyderabad Child Murder | కష్టాల్లో తోడుండాల్సిన తల్లి..

పోలీసుల కథనం ప్రకారం.. ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ నగర్‌కు చెందిన రేఖ (27)కు 2020లో రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, మనస్పర్థల కారణంగా పాప (తన్విక) పుట్టిన కొద్దిరోజులకే భర్త రాజు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి రేఖ తన ఆరేళ్ల కుమార్తె తన్వికతో కలిసి పుట్టింటి వద్దే ఉంటోంది. కష్ట కాలంలో బిడ్డకు ధైర్యంగా నిలవాల్సిన ఆ తల్లి, క్రమంగా తప్పుడు మార్గం వైపు అడుగులు వేసింది.

Hyderabad Child Murder | స్వార్థం ముందు ఓడిన పేగు బంధం..

ఈ క్రమంలో రేఖకు, సమీపంలోని కిరాణా షాపులో పనిచేసే సాయి (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడిని రెండో పెళ్లి చేసుకోవాలని రేఖ ఒత్తిడి చేయగా.. “ఆరేళ్ల కూతురు ఉండగా నిన్ను పెళ్లి చేసుకోలేను” అని సాయి నిరాకరించాడు. దీంతో, తన సుఖానికి, పెళ్లికి కన్నకూతురే అడ్డంగా మారిందని ఆ తల్లి మనసులో క్రూరత్వం మేల్కొంది. ఐదేళ్లు సాకిన పేగు బంధం కంటే, పరిచయమైన ప్రియుడే ఎక్కువయ్యాడు.

Hyderabad Child Murder | కనికరం లేకుండా..

చిన్నారిని వదిలించుకోవాలని క్రూరమైన స్కెచ్ వేసిన రేఖ.. శనివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కూతురు తన్వికను నిర్దయాత్మకంగా ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులోకి దించేసింది. చిన్నారి భయంతో కేకలు వేయకుండా పైన మూత గట్టిగా పెట్టేసింది. ఆపై బోర్ ఆన్ చేసి ట్యాంకు నింపి, ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేసింది. ప్రాణాల కోసం ఆ పసిబిడ్డ ట్యాంకు లోపల ఎంతలా తల్లడిల్లిపోయిందో తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పాప కనిపించడం లేదంటూ నాటకమాడింది.

Hyderabad Child Murder | పోలీసులు ప్రశ్నించడంతో..

బిడ్డ కనిపించకుండా పోయినా కన్నతల్లి రేఖలో ఎలాంటి కంగారు లేకపోవడం, ఆమె ప్రవర్తన వింతగా ఉండటంతో రేఖ  సోదరి శ్వేతకు అనుమానం వచ్చింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం సాయంత్రం ట్యాంకులో చిన్నారి తన్విక శవమై తేలింది. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అర్ధరాత్రి వేళ రేఖే పాపను పైకి తీసుకెళ్లినట్లు స్పష్టమైంది. ఆ ఆధారాలతో పోలీసులు గట్టిగా నిలదీయడంతో కసాయి తల్లి తన పాపాన్ని ఒప్పుకుంది. పోలీసులు  రేఖతో పాటు, ఆమెను ప్రేరేపించిన ప్రియుడు సాయిని కూడా అరెస్ట్ చేశారు.

ఇది కూడా చాదవండి: Palamuru Rangareddy Project | ‘పాలమూరు – రంగారెడ్డి’ పనులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *