అక్షరటుడే వెబ్‌డెస్క్: Elon Musk AI Prediction | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగం ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన తాజా వ్యాపార అంచనాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఐదేళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తుందని.. మరో పదేళ్లలో భూమ్మీద ఏకంగా 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వస్తాయని మస్క్ అంచనా వేశారు.
Elon Musk AI Prediction | ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకతతో ..
మస్క్ అంచనాల ప్రకారం.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు పనిచేసే అవకాశం ఉంది. ఒక్కో రోబో సాధారణ మనిషి కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకతతో (Productivity) పనిచేయగలిగితే.. అవన్నీ కలిసి చేసే పని ప్రపంచంలోని మొత్తం మానవ శక్తిని కూడా మించిపోతుంది. ఇక ఈ రోబోల సామర్థ్యం ప్రధానంగా ఏఐ సాఫ్ట్‌వేర్ పవర్, ఏఐ చిప్స్ శక్తి, అలాగే వస్తువులను కదిలించడం వంటి మెకానికల్ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.
Elon Musk AI Prediction | ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం..
ఏఐ, రోబోటిక్స్ అభివృద్ధి వల్ల రొటీన్ పనులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కోడింగ్, కస్టమర్ సర్వీస్, డేటా అనాలిసిస్, అకౌంటింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి రంగాల్లో ఏఐ టూల్స్ విపరీతంగా వాడేస్తున్నారు. భవిష్యత్తులో హ్యూమనాయిడ్ రోబోలు కూడా ఇండస్ట్రీలు, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రమాదకరమైన పనులు, లాజిస్టిక్స్ రంగాల్లోకి పెద్దఎత్తున ప్రవేశిస్తే కొన్ని ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే టెక్నాలజీతో పాటు కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు.
Elon Musk AI Prediction | రోబోలే రోబోలను తయారు చేస్తే?
హ్యూమనాయిడ్ రోబోల పని కేవలం మనుషులు చెప్పిన పనులు చేయడానికే పరిమితం కాదని మస్క్ తెలిపారు. భవిష్యత్తులో రోబోలే స్వయంగా ఇతర రోబోలను తయారు చేసే స్థాయికి చేరుకుంటే, వాటి సంఖ్య మరింత వేగంగా పెరుగుతుందని పేర్కొన్నారు. టెస్లా సంస్థ ఇప్పటికే ‘ఆప్టిమస్’ (Optimus) పేరుతో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది. మనుషులకు విసుగు తెప్పించే, ప్రమాదకరమైన పనులను వీటితో చేయించాలన్నదే టెస్లా ప్రధాన లక్ష్యం. మరోవైపు చైనా కూడా ఈ రంగంలో వేగంగా అడుగులు వేస్తూ గట్టి పోటీ ఇస్తోంది.
Elon Musk AI Prediction | డబ్బు ప్రాధాన్యత మారుతుందా?
ఏఐ, రోబోల సాయంతో వస్తువులు, సేవలు అత్యంత తక్కువ ఖర్చుతో విరివిగా ఉత్పత్తి అయితే.. భవిష్యత్తులో సంపద, డబ్బు విలువ నిర్వచనమే మారిపోవచ్చని మస్క్ ఆసక్తికర జోస్యం చెప్పారు. అందరికీ అవసరమైనవి సమృద్ధిగా దొరికితే కేవలం జీవనోపాధి కోసం మాత్రమే పనిచేయాల్సిన అవసరం తగ్గవచ్చని, అప్పుడు ఉద్యోగం అనేది వ్యక్తిగత ఆసక్తి లేదా సంతృప్తి కోసం చేసే పనిగా మారొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ప్రభుత్వాల నియంత్రణలు, టెక్నాలజీ అభివృద్ధి చెందే వేగంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఏఐ, రోబోలు మన పనితీరును పూర్తిగా మారుస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ఉద్యోగాలు కనుమరుగవుతాయా అని భయపడే కంటే, కొత్త టెక్నాలజీకి తగినట్టుగా మన నైపుణ్యాలను (Skills) ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడమే అసలైన సవాల్‌గా మారుతోంది.
ఇది కూడా చదవండి: Stock Market Losses | నష్టాల బాటలో స్టాక్ మార్కెట్