అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Ailapur Society Irregularities | నందిపేట మండలం (Nandipet Mandal) ఐలాపూర్ సొసైటీలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని సొసైటీ వైస్ ఛైర్మన్ చిన్న రాజన్న కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
Ailapur Society Irregularities | కొన్నేళ్లుగా అక్రమాలు
కొన్నేళ్లుగా సొసైటీ కార్యకలాపాలు, ధాన్యం కొనుగోళ్లు, హమాలీ చార్జీలు, ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారని చిన్న రాజన్న పేర్కొన్నారు. సొసైటీ ఖర్చులు, లెక్కల నిర్వహణకు సంబంధించి తేడాలున్నాయనే ఆరోపణలున్నాయని తెలిపారు. ప్రస్తుతం సొసైటీ ఛైర్మన్గా కొనసాగుతున్న మీసాల సుదర్శన్ ఆధ్వర్యంలో సొసైటీ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. సొసైటీ రికార్డులు, ఖాతాల నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ ఆరోపణల వాస్తవాలను నిర్ధారించడానికి సంబంధిత రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
Ailapur Society Irregularities | ధాన్యం కొనుగోళ్లపై..
నందిపేట, వెల్మల్, ఐలాపూర్, కంఠం, ఆంధ్రనగర్, రైతు ఫారం, జోజిపేట తదితర గ్రామాల నుంచి ప్రతి పంట సీజన్లో సొసైటీ తరపున సుమారు 4.40 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే ధాన్యం కొనుగోలు పరిమాణం, రైతులకు చెల్లింపులు, హమాలీ చార్జీలు, రవాణా ఖర్చులు, సొసైటీ ఖాతాల్లో నమోదు చేసిన వివరాలను గ్రామాల వారీగా, సీజన్ల వారీగా తనిఖీ చేయాలని ఆయన కలెక్టర్కు విన్నవించారు. హమాలీలకు చెల్లించిన మొత్తానికి, రైతుల నుంచి వసూలు చేసిన మొత్తానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
Ailapur Society Irregularities | వ్యయాలకు లెక్కలేవి..?
సొసైటీ నిర్వహణ ఖర్చుల పేరుతో భారీ మొత్తాలు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపించారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈ ఖర్చులకు సంబంధించిన ప్రతి బిల్లు, వౌచర్, రసీదు, చెక్, బ్యాంకు స్టేట్మెంట్, ఇతర ఆధారాలను పరిశీలించి, వాస్తవంగా ఖర్చు జరిగిందా లేదా నిర్ధారించాలని జిల్లా పాలనాధికారిని కోరారు. ఆడిట్ సిబ్బందిని మేనేజ్ చేసి ఈ అక్రమాలు బయటకు రాకుండా చేశారని ఆరోపించారు. గత ఏడాది నిర్వహించిన ఆడిట్ నివేదికలు, ఆడిట్ అభ్యంతరాలు, వాటికి సొసైటీ ఇచ్చిన సమాధానాలు, అభ్యంతరాల పరిష్కారానికి సంబంధించిన రికార్డులను పూర్తిగా పరిశీలించాలన్నారు.. పదేళ్ల సొసైటీ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Ailapur Society Irregularities | సంబంధిత వ్యక్తులను బాధ్యులను చేయాలి
సొసైటీ నిధులకు నష్టం జరిగినట్లు నిర్ధారణ అయితే, నష్టాన్ని బాధ్యుల నుంచి నిబంధనల ప్రకారం రికవరీ చేయాలని ఆయన కలెక్టర్కు కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, విచారణ ఫలితాలను పారదర్శకంగా వెల్లడించి, సొసైటీ కార్యకలాపాల్లో పూర్తి స్థాయి జవాబుదారీతనం, పారదర్శకతను ఏర్పాటు చేయాలన్నారు. దీనిని వ్యక్తిగత వివాదంగా కాకుండా, రైతుల ప్రయోజనాలకు, సొసైటీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన అంశంగా పరిగణించి తక్షణమే విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి..: Konda Laxman Bapuji | యువత కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి