GGH Service Book Collections | రూ.6వేలు కొట్టు.. సర్వీస్​ బుక్​ పట్టు.. జీజీహెచ్​లో దర్జాగా వసూళ్లు..

అరకొర జీతంతో పని చేస్తున్న ఆస్పత్రి నర్సులు సర్వీస్ బుక్కు కోసం తంటాలు పడాల్సి వస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: GGH Service Book Collections | అరకొర జీతంతో పని చేస్తున్న ఆస్పత్రి నర్సులు సర్వీస్ బుక్కు కోసం తంటాలు పడాల్సి వస్తోంది. తాము నిర్వర్తిస్తున్న విధులకు కేరాఫ్​గా ఉండే సర్వీస్ బుక్ అంశం ఇప్పుడు నర్సుల పాలిట శాపంగా మారుతోంది. ఆ బుక్ కావాలంటే నజరానా ఇచ్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది.

GGH Service Book Collections | కామారెడ్డి జీజీహెచ్​లో

కామారెడ్డి (Kamareddy) జీజీహెచ్​లో దాదాపు 200 మంది నర్సులు పని చేస్తున్నారు. షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న నర్సులు ప్రస్తుతం ఎవరికి చెప్పుకోలేని సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికి న్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీస్ బుక్ కోసం మధ్యవర్తులు, బ్రోకర్లు డబ్బులు వసూళ్లు చేస్తుండటం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వసూళ్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

GGH Service Book Collections | 200 మంది నర్సుల నుంచి వసూళ్ల వేట

నర్సులకు సర్వీస్ బుక్ తప్పనిసరి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ వంటి అన్నింటికీ ఈ పుస్తకమే ఆధారం. అలాంటి కీలకమైన సర్వీస్ బుక్ ఇవ్వాలంటే ఒక్కొక్కరి నుంచి రూ.6 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఆసుపత్రిలోనే కొందరు మధ్యవర్తులు, బ్రోకర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారని నర్సులు వాపోతున్నారు.

GGH Service Book Collections | డబ్బులిస్తేనే పని.. లేదంటే జాప్యం

డబ్బులు ఇచ్చిన వారికే సర్వీస్ బుక్ పని వేగంగా జరుగుతుందని, లేదంటే ఫైల్ పెండింగ్‌లో పెడతామని బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ‘సర్వీస్ బుక్ కావాలంటే 6 వేలు ఇవ్వాల్సిందే’ అని తేల్చి చెబుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నర్సులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తమ వద్ద నుంచి ఇలా వసూలు చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

GGH Service Book Collections | రూ. 6 వేల చొప్పున లక్షల్లో వసూళ్లు..?

ప్రస్తుతం జీజీహెచ్ లో 205 మంది నర్సులు పని చేస్తున్నారు. వీరి వద్ద సర్వీస్ బుక్ కోసం ఒక్కొక్కరి వద్ద రూ.6 వేలు చొప్పున వసూలు చేస్తే దాదాపు రూ.12 లక్షలకు పైమాటే. గత రెండు నెలల క్రితం సర్వీస్ బుక్ పేరుతో 164 మంది నర్సుల నుంచి వసూళ్లు చేయగా, ఫిర్యాదుల నేపథ్యంలో వసూలు చేసిన మొత్తాన్ని ఫోన్ పే, నగదు రూపంలో తిరిగి ఇచ్చేశారు. అయినా మళ్లీ ఇప్పుడు అదే వసూళ్ల పర్వం మొదలవ్వడం వెనుక వైద్యాధికారుల పాత్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

GGH Service Book Collections | ముచ్చటగా మూడోసారి..

ఇలా వసూళ్లకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. ఇది ముచ్చటగా మూడోసారి. గతంలో కూడా రెండుసార్లు ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడ్డారు. ఫిర్యాదులు రావడంతో డబ్బులు వెనక్కి ఇచ్చి సరిపెట్టారు తప్ప, బాధ్యులపై ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదు. దీంతోనే మళ్లీ అదే దందా యథేచ్ఛగా కొనసాగుతోందని నర్సులు ఆరోపిస్తున్నారు.

GGH Service Book Collections | రాష్ట్రవ్యాప్తంగా వసూళ్ల నెట్​వర్క్​..

కామారెడ్డిలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే తరహా వసూళ్లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా? పైస్థాయి అధికారుల అండదండలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినా కేవలం డబ్బులు వెనక్కి ఇప్పించి చేతులు దులుపుకోవడం వెనుక మతలబు ఏంటని నర్సులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన సర్వీస్ బుక్ కోసం నర్సుల నుంచి బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతున్న వారిపై జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత నర్సులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Ghanpur Railway Gate | నేటి నుంచి ఘన్‌పూర్ రైల్వే గేటు బంద్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *