Gautam Adani Richest | మళ్లీ అగ్రపీఠంపై అదానీ.. ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు!

భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరంటే అందరూ ముందుగా ముఖేష్ అంబానీ పేరు చెబుతారు. అయితే, తాజా నివేదికలు ఈ లెక్కలను మార్చేశాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gautam Adani Richest | భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరంటే అందరూ ముందుగా ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) పేరు చెబుతారు. అయితే, తాజా నివేదికలు ఈ లెక్కలను మార్చేశాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ విడుదల చేసిన తాజా జాబితాలో అదానీ కుటుంబం అగ్రపీఠాన్ని దక్కించుకుంది.

తాజా నివేదిక ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద ఏడాది వ్యవధిలోనే 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు (96 బిలియన్ డాలర్లు) చేరుకుంది. మరోవైపు ముఖేష్ అంబానీ నికర విలువ 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లకు (90 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. దీంతో అంబానీ కంటే రూ.59,400 కోట్ల ఆధిక్యంతో అదానీ మొదటి స్థానంలో నిలిచారు.

Gautam Adani Richest | దేశ సంపదలో సగానికి సమానం..

భారతదేశంలో సంపన్నుల సంఖ్య ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజా జాబితాలో కనీసం రూ.1,000 కోట్ల సంపద కలిగిన వ్యక్తులు 1,810 మందికి చేరగా, వారి మొత్తం సంపద 12.8 శాతం ఎగబాకి రూ.187.5 లక్షల కోట్లకు (1.96 ట్రిలియన్ డాలర్లు) చేరింది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం కావడం విశేషం. ఇక దేశంలో డాలర్-బిలియనీర్ల సంఖ్య సరికొత్త గరిష్టమైన 391కి చేరింది.

Gautam Adani Richest | టాప్ 10లో అనూహ్య మార్పులు..

మెటల్, స్టీల్, ఫార్మా రంగాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. ఆర్సెలర్ మిట్టల్ అధినేత ఎల్.ఎన్.మిట్టల్ సంపద 93 శాతం వృద్ధితో రూ.3.39 లక్షల కోట్లకు చేరి మూడో స్థానానికి ఎగబాకారు. ఒక్క ఏడాదిలోనే అత్యధికంగా రూ.1.64 లక్షల కోట్ల సంపదను పెంచుకున్న వ్యక్తిగా ఆయన నిలిచారు. వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్ కుటుంబం (రూ.2.08 లక్షల కోట్లు) 9వ స్థానంలో, టోరెంట్ ఫార్మా సమీర్ మెహతా కుటుంబం (రూ.1.89 లక్షల కోట్లు) 10వ స్థానంలో నిలిచాయి. సాంప్రదాయ రంగాలతో పాటు టెక్నాలజీ రంగం నుంచి యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో మెరిశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగం నుంచి నాగేంద్ర నాగరాజ, ఏఐ ఆధారిత ‘విస్పర్ ఫ్లో’ ద్వారా కేవలం 28 ఏళ్ల తనయ్ కొఠారి, సహజ్ గార్గ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే ‘జెప్టో’ సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా (23) ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.

Gautam Adani Richest |మహిళల ప్రాతినిధ్యం భేష్..

ఈసారి జాబితాలో మహిళల సంఖ్య 131కి చేరింది. రోష్ని నాడార్ మల్హోత్రా (రూ.2.79 లక్షల కోట్లు) దేశ అత్యంత ధనిక మహిళగా నిలవగా, జయశ్రీ ఉల్లాల్ (రూ.77,400 కోట్లు) స్వయంకృషితో ఎదిగిన నంబర్ 1 మహిళగా గుర్తింపు పొందారు. ఇక నగరాల వారీగా చూస్తే ముంబై (465) అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ (236), బెంగళూరు (129) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా సంపద సృష్టిలో స్వయంకృషితో ఎదిగిన వారి వాటా 70 శాతానికి చేరడం భారత ఆర్థిక ప్రగతికి అద్దం పడుతోంది.

ఇది కూడా చదవండి:  Bhadradri Temple | ఓట్ల కోసం దేవుడిని మోసం చేసిన బీఆర్ఎస్ : పొంగులేటి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *