అక్షరటుడే వెబ్‌డెస్క్: Sridhar Babu Comments | తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ( KCR )ఫాంహౌస్‌కే పరిమితం కావడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ‘మహా ధర్నా’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ సభకు వచ్చి తన అనుభవాన్ని పంచుకోవాలని ఆయన హితవు పలికారు.
Sridhar Babu Comments | రోడ్లపై మాట్లాడించడం కాదు..
బీఆర్ఎస్ నేతలతో రోడ్లపై మాట్లాడించడం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై సమాధానం చెప్తామని శ్రీధర్ బాబు సవాల్ విసిరారు. కేసీఆర్ వైఖరి ఇలాగే కొనసాగితే రానున్న మరో పదేళ్లు కూడా ఆ పార్టీ నేతలు రోడ్ల మీదనే ఉండాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఇకపై ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారాలను కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Sridhar Babu Comments | పదేళ్ల పాలనలో ఏం చేశారు?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి జవాబుదారీతనంతో పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ఉచితంగా ప్రయాణిస్తున్నారా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో పేదలకు కనీసం కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు రేషన్ కార్డులు రాలేదా? వారు సన్నబియ్యం తీసుకోవడం లేదా? అని నిలదీశారు. పదేళ్ల కాలంలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు అదే యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Nizamabad Child Kidnapping | మాతాశిశు ఆస్పత్రిలో ఉద్రిక్తత.. సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నం..