అక్షరటుడే వెబ్‌డెస్క్: Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు , తెలంగాణ సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao )తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రను గానీ, దాని ప్రాధాన్యతను గానీ ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఎంత ప్రయత్నించినా అడ్డుకోలేరంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు గుప్పించారు.
Kaleshwaram Project | కాళేశ్వరం లేకుంటే ఆ నీళ్లు ఎక్కడివి?
కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులు కాళేశ్వరం వ్యవస్థలో అంతర్భాగమనే వాస్తవాన్ని ఎంత దాచాలని చూసినా సాధ్యం కాదన్నారు.
కేసీఆర్ హయాంలో ఎల్లంపల్లి, దేవాదుల, మిడ్‌మానేరు ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం వల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని గుర్తుచేశారు. కాళేశ్వరం ద్వారానే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని పేర్కొన్నారు.
Kaleshwaram Project |వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి రంగాలపై చూపుతున్న నిర్లక్ష్యం తెలంగాణకు శాపంగా మారిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన వల్ల గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మండిపడ్డారు. అబద్ధపు ప్రచారాలు, రీట్వీట్లతో రైతులను మభ్యపెట్టడం ఆపాలని హితవు పలికారు.
Kaleshwaram Project | ఈనెల 18న జీఆర్ఎంబీ కార్యాలయం ముట్టడి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఎజెండా నుంచి తక్షణమే తొలగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ అంశాలను తొలగించకుండా ఈనెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశానికి హాజరైతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు వేలాది మంది రైతులతో కలిసి జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Sriramsagar Project | శ్రీరాంసాగర్కు తగ్గిన వరద