Youtuber Home Robbery | యూట్యూబ్‌లో డబ్బుల వీడియో.. సీన్ కట్ చేస్తే రూ.1 కోటి, కిలో బంగారం మాయం!

ఇటీవల మంచంపై కట్టల కొద్దీ నోట్లు పర్చి ఉన్న ఓ వీడియోను, తమ చిన్నారిపై నోట్ల వర్షం కురిపించిన రీల్​ను, డబ్బులు చూపిస్తున్న వీడియోను వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Youtuber Home Robbery | సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం ఎడాపెడా రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకో హెచ్చరికే! యూట్యూబ్‌లో వీడియోల కోసం నోట్ల కట్టలను ప్రదర్శించిన ఒక యూట్యూబర్ దంపతులకు దొంగలు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా కోటి రూపాయల నగదు, కిలో బంగారం ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది.

Youtuber Home Robbery | అసలేం జరిగింది?

కన్యాకుమారి Kanniyakumari జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణానికి చెందిన వినోద్ కుమార్ స్థానికంగా ప్రముఖ యూట్యూబర్. ఆయన భార్య మధుమితతో కలిసి క్రమం తప్పకుండా యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేసేవాడు. అయితే, ఇటీవల మంచంపై కట్టల కొద్దీ నోట్లు పర్చి ఉన్న ఓ వీడియోను, తమ చిన్నారిపై నోట్ల వర్షం కురిపించిన రీల్​ను, డబ్బులు చూపిస్తున్న వీడియోను వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also read : Vijay Deverakonda Ranabali | దసరా బరిలో రౌడీ హీరో: ‘రణబాలి’ రిలీజ్ డేట్‌పై మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ!

ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు దొంగల ముఠా కంట పడింది. యూట్యూబర్ ఇంట్లో భారీగా నగదు ఉందనే విషయాన్ని గ్రహించిన ఆ ముఠా, పక్కా స్కెచ్ వేసింది.

Youtuber Home Robbery | షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ప్లాన్ రివర్స్!

సరిగ్గా వీలు చూసి, వినోద్ కుమార్-మధుమిత దంపతులు ఇంటికి తాళం వేసి షాపింగ్‌కు వెళ్లిన సమయంలో దొంగలు రంగంలోకి దిగారు. ఇంటి వెనుక వైపు తలుపులు బద్దలుగొట్టి లోపలికి చొరబడ్డారు. మంచం కింద, బీరువాలో ఉన్న రూ. 1 కోటి నగదుతో పాటు కిలో బంగారాన్ని మూటగట్టుకుని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు.

షాపింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన భార్యాభర్తలు, వెనుక తలుపులు తీసి ఉండటం, ఇంట్లోని విలువైన వస్తువులు మాయమవ్వడం చూసి గుండెలావిరయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, వైరల్ అయిన వీడియో ఆధారంగానే ఈ చోరీకి పథకం రచించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సోషల్ మీడియాలో హడావుడి చేసి ఆస్తుల ప్రదర్శన చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *