Congo Plane Crash | కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు ఉన్నతాధికారులు సహా 14 మంది దుర్మరణం

ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు ఛైర్మన్ ట్రైఫాన్ కిన్-కీ ములుంబా తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congo Plane Crash | డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డిఆర్ కాంగో)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ సాయుధ దళాలకు చెందిన విమానం కూలిపోయిన ఘోర ప్రమాదంలో ఇద్దరు సీనియర్ సైనిక జనరల్స్‌తో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి కాంగో మిలిటరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Congo Plane Crash | సాంకేతిక లోపమేనా..

అందిన సమాచారం ప్రకారం.. ఈ మిలిటరీ విమానం నైరుతి పట్టణమైన ‘కిక్విట్’ (Kikwit) నుంచి రాజధాని ‘కిన్షాసా’కు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో అదుపుతప్పిన విమానం ‘కెంగే’ (Kenge) ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాద ధాటికి విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Congo Plane Crash | తీరని లోటు

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు అత్యున్నత అధికారులు లెఫ్టినెంట్ జనరల్ ముతోంబో కతలై టియెండే (మిలిటరీ కోర్టు హెడ్), లెఫ్టినెంట్ జనరల్ బాకుమి లికూలియా (ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆడిటర్ జనరల్) ఉన్నారు.

ఇది కూడా చదవండి: Youtuber Home Robbery | యూట్యూబ్‌లో డబ్బుల వీడియో.. సీన్ కట్ చేస్తే రూ.1 కోటి, కిలో బంగారం మాయం!

“ఇద్దరు జనరల్ ఆఫీసర్లతో పాటు, వారితో ఉన్న 12 మంది ప్రతినిధుల బృందం, విమాన సిబ్బంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు” అని కాంగో సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకేంజ్ విచారకరంగా తెలిపారు.

Congo Plane Crash | ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం

విమానం ఏ పరిస్థితుల్లో కూలిపోయిందో, సాంకేతిక లోపానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మేజర్ జనరల్ ఎకేంజ్ పేర్కొన్నారు. మరోవైపు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు ఛైర్మన్ ట్రైఫాన్ కిన్-కీ ములుంబా తెలిపారు.

తూర్పు కాంగో ప్రాంతంలో M23 తిరుగుబాటుదారులతో తీవ్ర స్థాయిలో సైనిక పోరాటం జరుగుతున్న తరుణంలో, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇద్దరు ఉన్నత స్థాయి సైనిక అధికారులను విమాన ప్రమాదంలో కోల్పోవడం కాంగో రక్షణ దళాలకు తీరని లోటుగా మారింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *