అక్షరటుడే వెబ్‌డెస్క్: Monday Shiva Puja | హిందూ సంప్రదాయంలో వారంలోని ప్రతి రోజుకూ ఒక్కో దైవంతో లేదా గ్రహంతో ప్రత్యేక సంబంధం ఉంటుంది. మిగతా రోజులతో పోలిస్తే సోమవారం మాత్రం శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతుంటాయి. అసలు సోమవారానికి, పరమశివుడికి ఉన్న అనుబంధం ఏమిటి? ఆ రోజు చేసే ఉపవాసాల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం..
Monday Shiva Puja | చంద్రుడికి చెందిన రోజుగా..
సంస్కృతంలో ‘సోమ’ అంటే చంద్రుడు అని అర్థం. అందుకే సోమవారం అంటే చంద్రుడికి చెందిన రోజుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology ) సోమవారానికి చంద్రుడే అధిపతి. ఇక పరమశివుడికి చంద్రుడితో ఉన్న అనుబంధం గురించి పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. శివుడి జటాజూటంలో చంద్రవంక కొలువై ఉండటం వల్లనే ఆయనను ‘చంద్రశేఖరుడు’ అని పిలుస్తారు.
పురాణ కథనం ప్రకారం.. ప్రజాపతి దక్షుడి శాపం కారణంగా చంద్రుడు తన తేజస్సును కోల్పోయి క్రమంగా క్షీణించసాగాడు. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి చంద్రుడు పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిచాడు. శివలింగాన్ని ప్రతిష్ఠించి తీవ్రమైన తపస్సు చేశాడు. చంద్రుడి భక్తికి సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై ఆయనకు శాప విమోచనం కలిగించాడు. అంతేకాకుండా పోయిన తేజస్సును తిరిగి ప్రసాదించడంతో పాటు తన తలపై చంద్రుడికి ప్రత్యేక స్థానం కల్పించాడు. అప్పటి నుంచే శివుడికి, సోమవారానికి విడదీయరాని సంబంధం ఏర్పడిందని ఆధ్యాత్మిక విశ్వాసం.
Monday Shiva Puja | ఉపవాస ప్రాముఖ్యత..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు, భావోద్వేగాలకు అధిపతి. చంద్రుడి ప్రభావం మనుషుల ఆలోచనా విధానంపై తీవ్రంగా ఉంటుంది. చంద్రుడే స్వయంగా శివుడిని పూజించి తన కష్టాల నుంచి గట్టెక్కాడనే నమ్మకంతో భక్తులు సోమవారం ఉపవాసాలు ఆచరిస్తారు. సోమవారం ఉపవాసం ఉండి భక్తితో శివుడిని పూజిస్తే మనశ్శాంతి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్ముతారు. జాతకంలో చంద్ర దోషాలు ఉన్నవారు ఈ పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
Monday Shiva Puja | 16 సోమవారాల వ్రతం..
ముఖ్యంగా పెళ్లి ఆలస్యమవుతున్న యువతీ యువకులు, తమకు నచ్చిన జీవిత భాగస్వామిని కోరుకునేవారు 16 సోమవారాల వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా పాటిస్తే వివాహానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగి త్వరగా పెళ్లి కుదురుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇది కూడా చదవండి: Bheemgal Police Incident | భీమ్గల్ ఘటనలో పోలీసుల తప్పు లేదు.. సీపీ సాయిచైతన్య