Sri Lanka U19 Cricketers Arrested | శ్రీలంక అండర్-19 క్రికెట్‌లో కలకలం.. మ‌హిళ‌లు స్నానం చేస్తుండ‌గా, వీడియోలు తీసిన క్రికెట‌ర్స్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sri Lanka U19 Cricketers Arrested | శ్రీలంక క్రికెట్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దేశానికి చెందిన ఇద్దరు అండర్-19 క్రికెటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబో (Colombo)లోని నరహెన్‌పిట ప్రాంతంలోని ఓ హోటల్‌లో మహిళలు స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలు వారిపై నమోదయ్యాయి.

హోటల్‌లో బస చేస్తున్న కొందరు మహిళలు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ప్రారంభ విచారణలో ఇద్దరు యువ క్రికెటర్లపై అనుమానాలు బలపడడంతో వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.

Sri Lanka U19 Cricketers Arrested | బెయిల్‌పై విడుద‌ల‌..

పోలీసులు ప్రస్తుతం కీలక విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తీసిన వీడియోలను వారు మరెవరితోనైనా పంచుకున్నారా? ఏదైనా ఆన్‌లైన్ వేదికల్లో అప్లోడ్ చేశారా? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని డిజిటల్ సాక్ష్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణ నిమిత్తం ఇద్దరు ఆటగాళ్లను అలుత్కడే మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి లంక కరెన్సీలో ఐదు లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.

Sri Lanka U19 Cricketers Arrested | కఠిన చర్యలు వచ్చే అవకాశాలు

ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు (Sri Lanka Cricket Board) ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ప్రకటించలేదు. అయితే గత కొద్ది రోజులుగా బోర్డులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత కార్యవర్గ సభ్యులను తొలగించడం, పరివర్తన కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. శ్రీలంక క్రికెట్‌ను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన ఈ పరివర్తన కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. అందులో మాజీ దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర కూడా సభ్యుడిగా ఉన్నారు.

ఈ వివాదాస్పద ఘటన నేపథ్యంలో బోర్డు నుంచి కఠిన చర్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటనతో యువ క్రీడాకారుల ప్రవర్తన, క్రమశిక్షణపై మళ్లీ చర్చ మొదలైంది. క్రీడల్లో ప్రతిభతో పాటు నైతిక విలువలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kohli Umpire Controversy | హోల్డర్ క్యాచ్‌పై వివాదం.. అంపైర్లతో కోహ్లీ వాగ్వాదం, చర్యలు తీసుకుంటారా?

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *