అక్షరటుడే, వెబ్డెస్క్: LK Advani Hospitalized | బీజేపీ సీనియర్ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. వైద్యులు ఆయనకు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
98 ఏళ్ల అద్వానీ వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యల కారణంగా గతంలోనూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ ఏడాది మే నెలలో కూడా ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. తాజా అనారోగ్యంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
LK Advani Hospitalized | రాజకీయ ప్రస్థానం
1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్లోని కరాచీలో జన్మించిన ఎల్కే అద్వానీ, భారత రాజకీయాల్లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు పనిచేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇది కూడా చదవండి: pm modi | అరాచక రాజకీయాలపై నిప్పులు చెరిగిన ప్రధాని.. ప్రత్యర్థులపై మోడీ పూర్తిగా అటాక్ మోడ్!
బీజేపీ ఎదుగుదలలో, పార్టీ సంస్థాగత బలోపేతంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రజా జీవితానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో పద్మవిభూషణ్, 2024లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకున్నారు.
LK Advani Hospitalized | ఇటీవల అద్వానీని కలిసిన ప్రధాని మోదీ
అద్వానీ ఆస్పత్రిలో చేరడానికి కొద్ది రోజుల ముందు, అక్టోబర్ 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మోదీ తన సుదీర్ఘ ప్రజాసేవకు అద్వానీ చేసిన కృషిని కొనియాడుతూ, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.