Jio IPO | అతిపెద్ద ఐపీవో.. లాభాలు అందించేనా?

భారీ ఐపీవోలు భారీ లాభాలను అందించడంలో విఫలమవుతున్నాయి. ఈ ధోరణిని రిలయన్స్ జియో అధిగమిస్తుందో లేదో చూడాలి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jio IPO | భారతదేశ ప్రైమరీ మార్కెట్‌లో లిస్టయిన పలు భారీ ఐపీవోలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. కొన్ని స్వల్ప లాభాలను అందించగా.. మరికొన్ని నష్టాలను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా వస్తున్న రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ కంపెనీ అయినా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను మెరుగుపరుస్తుందా లేదా ఇతర పెద్ద కంపెనీల ఐపీవోల మాదిరిగానే నిలుస్తుందా అన్న అంశంపై మార్కెట్‌లో చర్చ నడుస్తోంది.

Jio IPO | రూ. 10వేల కోట్లకు పైబడిన ఐపీవోలు..

భారత్‌లో రూ. 10వేల కోట్లకు పైబడిన ఐపీవో (IPO)లలో ఎక్కువ శాతం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేశాయి. కోల్ ఇండియా, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఇందుకు మినహాయింది. ఇవి ఐపీవో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. మిగిలినవారిలో కొన్ని స్వల్ప లాభాలను అందించగా.. మరికొన్ని నష్టాలను మిగిల్చాయి.

Jio IPO | లాభాలు అందించినవి..

భారీ ఐపీవోలలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మాత్రమే ఇన్వెస్టర్ల అంచనాలకు మించి రాణించింది. 2025 అక్టోబర్‌లో రూ. 11,607 కోట్ల ఐపీవోగా ఇన్వెస్టర్ల ముందుకు వచ్చిన ఈ కంపెనీ.. ఒక్కో ఈక్విటీ షేరును రూ. 1140 కు విక్రయించింది. కంపెనీ షేర్లు 50 శాతం ప్రీమియంతో రూ. 1710 వద్ద లిస్టై ఇన్వెస్టర్లకు సంపద సృష్టించి పెట్టాయి.
2010 నవంబర్‌లో కోల్ ఇండియా కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ నుంచి 15,199 కోట్లు సమీకరించింది. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 245 కాగా.. రూ. 342 వద్ద లిస్టయ్యింది. అంటే లిస్టింగ్ డే రోజున ఐపీవో ఇన్వెస్టర్లకు 39.7 శాతం లాభాలను అందించింది.
హెచ్డీబీ ఫైనాన్షియల్స్ కంపెనీ 2025 జూలైలో రూ. 12,500 కోట్ల ఐపీవోగా వచ్చింది. ఒక్కో షేరు ధర గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 740 కాగా.. 12.84 శాతం ప్రీమియంతో రూ. 835 వద్ద లిస్టయ్యింది.2024 నవంబర్‌లో ఐపీవోకు వచ్చిన స్విగ్గీ.. మార్కెట్ నుంచి రూ. 11,327 కోట్లు సమీకరించింది. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ. 390 కాగా.. 7.69 శాతం లాభాలతో రూ. 420 వద్ద లిస్టయ్యింది.

Jio IPO | నిరాశపరిచినవి..

పేటీఎం మాతృసంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.18,300 కోట్ల ఐపీవోగా వచ్చింది. ఇది 2021 నవంబర్‌లో లిస్టయ్యింది. పేటీఎం ఒక్కో షేరును రూ.2,150 కి విక్రయించగా.. 9.3 శాతం డిస్కౌంట్‌తో రూ.1,950 వద్ద లిస్టయ్యింది. లిస్టయిన తర్వాత భారీగా పతనమైంది. ఆ తర్వాత కోలుకున్నా.. ఇప్పటికీ ఐపీవో ప్రైస్ ను చేరలేదు.
దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిస్టింగ్‌లో పెట్టుబడిదారులను నిరాశకు గురిచేసింది. రూ. 20,557 కోట్ల ఐపీవోగా వచ్చిన ఈ సంస్థ.. 2022 మేలో స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యింది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 949కి విక్రయించగా.. 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ. 867.20 వద్ద లిస్ట్ అయ్యాయి.

  • హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,859 కోట్ల ఐపీవోతో వచ్చింది. 2024 అక్టోబర్ లో నిస్తేజంగా లిస్ట్ అయ్యింది. ఇష్యూ ధర రూ. 1,960 కాగా.. 1.3 శాతం డిస్కౌంట్‌తో రూ. 1,934 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి.
  • 2017 అక్టోబర్‌లో ఐపీవోకు వచ్చిన జనరల్ ఇన్యూరెస్స్ కార్పొరేషన్.. మార్కెట్‌నుంచి రూ. 11,257 కోట్లు సమీకరించింది. ఒక్కో షేరును రూ. 912కు విక్రయించగా.. రూ. 45 డిస్కౌంట్‌తో రూ. 857.50 వద్ద లిస్టయ్యింది.
  • టాటా క్యాపిటల్ 2025 అక్టోబర్‌లో ఐపీవోకు వచ్చింది. మార్కెట్ నుంచి రూ. 15,511 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 326కు విక్రయించగా.. 1.23 శాతం లాభంతో రూ. 330 వద్ద కంపెనీ షేర్లు లిస్టయ్యాయి.
  • ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్ నుంచి రూ. 22,561.57 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ఐపీవోకు వచ్చింది. ఇష్యూ ధర రూ. 1,785 కాగా.. 0.84 స్వల్ప లాభాలతో రూ. 1,800 వద్ద లిస్టయ్యింది.

Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్‌కు జీఎంపీ 24 శాతం..

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు వస్తుందన్న సమాచారం వెల్లడైనప్పటినుంచి మార్కెట్‌లో సందడి నెలకొంది. ఇది దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న పబ్లిక్ ఇష్యూ కావడంతో మార్కెట్‌లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రావడంతో గ్రే మార్కెట్ ప్రీమియం కూడా పెరిగింది. మంగళవారం జీఎంపీ రూ. 270 వద్ద ఉంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో 24 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ ఐపీవోలు ఇన్వెస్టర్లకు లాభాలను అందించలేవన్న సెంటిమెంట్‌ను జియో ప్లాట్‌ఫామ్స్ బ్రేక్ చేస్తుందని ఆశిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Jio Platforms IPO | భారీ ఐపీవో.. నేటినుంచి సబ్‌స్క్రిప్షన్ స్వీకరణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *