అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Dussehra Celebrations | ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాలకు విశేష స్పందన లభించింది. కామారెడ్డి (Kamareddy) చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు భారీగా తరలివచ్చి ఉత్సవాలను వీక్షించి హర్షం వ్యక్తం చేశారు.
Kamareddy Dussehra Celebrations | అబ్బురపర్చిన లేజర్‌షో..
ఇందిరాగాంధీ స్టేడియంలో దసరా పండుగ సందర్భంగా షబ్బీర్ అలీ ఫౌండేషన్, దసరా ఉత్సవాల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. స్టేడియం లోపల ఏర్పాటు చేసిన భారీ రావణ దహన కటౌట్ సెట్టింగ్‌ను, లేజర్ షోను వీక్షించేందుకు జిల్లా ప్రజలు భారీగా తరలివచ్చారు. స్టేడియం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ముందుగా నిర్వహించిన లేజర్ షో ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. డీజే పాటలకు యువత కేరింతలు కొట్టారు. అనంతరం రావణ దహనం నిర్వహించారు.
Kamareddy Dussehra Celebrations | క్రాకర్స్‌తో రావణుడి దహన కార్యక్రమం..

క్రాకర్స్ తో రావణుడిని దహనం చేయడంతో స్టేడియం ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. భారీ క్రాకర్స్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు స్టేడియం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డిలో కుల, మత రాజకీయాలకు అతీతంగా గత 40ఏళ్లుగా దసరా ఉత్సవాలను షబ్బీర్ అలీ ఫౌండేషన్, దసరా ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని తెలిపారు. యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు బారిన పడకుండా మైదానాలలో ఆటలు ఆడి శారీరకంగా, పౌష్టికంగా ఉండేటట్టు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. భవిష్యత్తులో కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర, జాతీయ స్థాయి ఆటలు నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Sharannavaratri Celebrations | ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. మిగిలింది నిమజ్జన కార్యక్రమమే..