అక్షరటుడే, వెబ్‌డెస్క్: Government Employee | ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజా భవన్ లో శుక్రవారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి సుమారు 45 సమస్యలను టీజీఈ జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్, టీజీఈ జేఏసీ భాగస్వామ్య పక్ష ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీసుకెళ్లారు.
Government Employee | సుదీర్ఘ చర్చ..
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంటింజెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై భట్టి విక్రమార్కకు వివరించారు. ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం, తద్వారా ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం, సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భట్టి విక్రమార్క సుదీర్ఘంగా చర్చించారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు షురూ చేసిందని, అయితే అన్ని సమస్యలను ఏకకాలంలో కాకుండా దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
పెన్షనర్ల సమస్యలను వంద రోజులలోనే పరిష్కరిస్తామని ఇప్పటికే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు, ఉద్యోగుల సమస్యలను కూడా 100 రోజుల్లోనే ప్రాధాన్యం క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.
Government Employee | త్వరలోనే సీఎంతో బట్టి బేటీ…
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్‌సీ నివేదికను తెప్పించుకొని అమలు చేస్తామని, ఈ విషయంలో ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
ఉద్యోగల సమస్యల పరిష్కారంలో భాగంగా ఉద్యోగ సంఘాలు ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను విరమించుకోవాలని, ఉద్యోగుల ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా ఉద్యోగుల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, ఇటీవల అత్యంత జఠిలమైన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తుచేశారు.
Government Employee | 5వ తేదీ తర్వాతే నిర్ణయం..
అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మే 5వ తేదీన చేపట్టనున్న కార్యాచరణపై టీజీఈ జేఏసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని టీజీఈ జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి స్పష్టం చేశారు.
భట్టితో భేటి అయిన వారిలో టీజీఈ జేఏసీ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కె.రామకృష్ణ, ఎస్.రాములు, బాణాల రాం రెడ్డి, పెంటయ్య, రామేష్ పాక, డా.నిర్మల, ఎండీ హబీబ్ మియా, కె.మహిపాల్ రెడ్డి, దర్శన్ గౌడ్, వి, బిక్షం, ఉపెందర్ రావు, ఎన్.రాబర్ట్ బ్రూస్, డా.ఏ.సైదులు, జే.బుచ్చయ్య, కె.కుమార స్వామి, ఎస్‌కే.హబీబ్ మియా, వెంకటేశం, వివేక్, మమత, క్రాంతి కుమార్, రవి, నరేందర్, స్వామి, దేవిక, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్రెడ్డి

