అక్షరటుడే, డిచ్పల్లి: Panchayat Tractor Insurance | గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చి..ఇంటింటికీ చెత్త సేకరించేందుకు ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు కొనుగోలు చేశారు. అయితే వాటికి సంబంధించి బీమా కాలపరిమితి గతంలోనే ముగిసినా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాలు గ్రామాలకు ఉపయోగపడాల్సి ఉండగా, వాటి నిర్వహణ భారంగా మారితే అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
Panchayat Tractor Insurance | నిర్వహణ మాటేమిటి?
నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుధ్య పనుల కోసం ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. అయితే వాహనాలను సమకూర్చడంతోనే బాధ్యత అయిపోలేదు. వాటికి నిరంతరం డీజిల్, ఇంజిన్ ఆయిల్, విడి భాగాలు, మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చులు భరించాలి. వీటితోపాటు బీమా పునరుద్ధరణ ప్రధాన అంశం. అవసరమైన ధ్రువపత్రాల నిర్వహణ కూడా తప్పనిసరి. ఆదాయ వనరులున్న లేని గ్రామపంచాయతీల్లో ఈ ఖర్చులకు నిధులు ఎలా సమకూరుస్తున్నారన్నది కీలకంగా మారింది. సరైన నిర్వహణ లేకపోతే వాహనాలు తరచూ మరమ్మతులకు గురికావడం, చివరకు వినియోగానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
Panchayat Tractor Insurance | బీమా గడువులపై నిఘా ఏదీ?
జిల్లాలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు బీమా గడువు ముగిసి ఏళ్లు కావస్తోంది. వాస్తవానికి ప్రతిఏడాది క్రమం తప్పకుండా బీమా రెన్యూవల్ చేయాలి. బీమా లేకుండా వినియోగిస్తే ప్రమాదాల బారినపడితే తీవ్ర ఆర్థిక, చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే ముప్పు పొంచి ఉంది. ప్రజా అవసరాల కోసం ఉపయోగించే వాహనాల విషయంలో ఈ అంశాన్ని మరింత బాధ్యతగా చూడాలి. ఏ వాహనానికి బీమా ఎప్పటివరకు ఉంది..? ఎన్ని వాహనాలకు ఫిట్నెస్ ధ్రువపత్రాలు చెల్లుబాటులో ఉన్నాయి..? రిజిస్ట్రేషన్, ఇతర అనుమతులు సక్రమంగా ఉన్నాయా..? అనే వివరాలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. జిల్లావ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు నిర్వహించడం లేదనే విషయం తేటతెల్లమవుతోంది.
Panchayat Tractor Insurance | ఖర్చుల భారం..
ట్రాక్టర్లు, ట్రాలీల నిర్వహణకు నిధులు సరిపోకపోతే మరమ్మతులు వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో చెత్త సేకరణ, పారిశుధ్య పనులకు ఆటంకం కలగవచ్చు. వాహనాలు అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఇది పంచాయతీలపై అదనపు భారాన్ని మోపడంతోపాటు గ్రామస్తులకు అసౌకర్యం కలిగించే ప్రమాదం నెలకొంది. జిల్లాలో ఎన్ని వాహనాలు పనిచేస్తున్నాయి, ఎన్ని మరమ్మతుల్లో ఉన్నాయి, ఎన్ని నిరుపయోగంగా ఉన్నాయనే అధికారిక గణాంకాలు వెలుగులోకి రావాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులపై గ్రామపంచాయతీల వారీగా వివరాలు సేకరిస్తే సమస్య తీవ్రత స్పష్టమవుతుంది.
Panchayat Tractor Insurance | డ్రైవర్ల నియామకంపై స్పష్టత కరవు?
ట్రాక్టర్లు, ఇతర వాహనాలను నడిపేందుకు అర్హత కలిగిన డ్రైవర్లు అవసరం. ప్రత్యేక డ్రైవర్లను నియమించడం, వారికి జీతాలు చెల్లించడం పంచాయతీలకు అదనపు ఖర్చుగా మారిందని సర్పంచులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల నియామకం, వేతనాల చెల్లింపు, విధుల కేటాయింపుపై స్పష్టమైన విధానం ఉండాలి. ప్రతి గ్రామ పంచాయతీలో వాహనాల కొనుగోలు, వినియోగం, ఇంధన ఖర్చులు, మరమ్మతులు, బీమా పునరుద్ధరణ, ఫిట్నెస్ వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయాలి. వాహనాలపై చేసిన ఖర్చులకు సంబంధించి బిల్లులు, రికార్డులను పరిశీలించాలి. వాహనాలు ఎంతకాలంగా వినియోగంలో ఉన్నాయి? మరమ్మతుల కోసం ఎంత ఖర్చు చేశారు? తరచూ మరమ్మతులు అవసరమవుతున్న వాహనాల విషయంలో తీసుకుంటున్న చర్యల వంటి అంశాలపై ఆడిట్, పర్యవేక్షణ ఉండాలి. దీంతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడంతోపాటు వాహనాల వినియోగ సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
Panchayat Tractor Insurance | సమగ్ర సర్వేతోనే పరిస్థితి వెలుగులోకి!
జిల్లాలోని గ్రామపంచాయతీల వారీగా వాహనాల సంఖ్య, ప్రస్తుత స్థితి, బీమా గడువు, ఫిట్నెస్, మరమ్మతుల వ్యయం, డ్రైవర్ల అందుబాటు వంటి అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉంది. సంబంధిత అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి, లోపాలుంటే సరిదిద్దే చర్యలు చేపట్టాలి. ప్రజాధనంతో సమకూర్చిన వాహనాలు రికార్డులకే పరిమితం కాకుండా గ్రామాలకు ఉపయోగపడేలా చూడటమే లక్ష్యంగా ఉండాలని ప్రజలు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..: Dal Truck Accident | జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్‌కు స్వల్పగాయాలు