అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mal Thummeda Leopard | కామారెడ్డి జిల్లా (Kamareddy District) నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద గ్రామంలో చిరుత ఆనవాళ్లు కలకలం రేపాయి. స్థానిక చెన్నకేశ్వర స్వామి గుట్టపై చిరుతపులి కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
Mal Thummeda Leopard | అటవీ శాఖ అధికారులకు సమాచారం..
గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టపై చిరుత సంచరిస్తుండటాన్ని రైతులు గుర్తించి సర్పంచ్ సాయిలుకు, ఇతర గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో వారు అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం చేరవేశారు. గ్రామ సమీపంలోని చెన్నకేశ్వర స్వామి గుట్ట దిగువన రైతులు వరి ధాన్యం నూర్పిడి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నకేశ్వర స్వామి ఆలయ గర్భగుడి సమీపంలో మెట్ల పక్కన చిరుత కనిపించింది. దాని చుట్టూ గద్దలు గుమిగూడి తిరుగుతుండటాన్ని గమనించిన రైతులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మెదక్–ఎల్లారెడ్డి జాతీయ రహదారిని దాటి వచ్చినట్లు భావిస్తున్న చిరుత మొన్న వెంకంపల్లి గుట్టపై కనిపించగా.. ఇప్పుడు మాల్ తుమ్మెద గ్రామ సమీపంలోని గుట్టపై కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Mal Thummeda Leopard | అధికారుల పర్యవేక్షణ..
గ్రామస్తులకు హెచ్చరిక సమాచారం అందుకున్న వీఆర్వో రాఘవేందర్, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఉన్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. సుమారు రెండు గంటల పాటు చిరుత కదలికలను గమనించినట్లు తెలిసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. మండల పరిధిలో సుమారు నెల రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ చిరుతను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Mal Thummeda Leopard | బోను ఏర్పాటుకు అనుమతులు అవసరం: ఎఫ్‌ఆర్‌ఓ
ఈ విషయంపై ఎఫ్‌ఆర్‌ఓ వాసుదేవ్‌ను వివరణ కోరగా, చిరుతను బంధించేందుకు జిల్లా అధికారి నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్న తర్వాత బోను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. చిరుత సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతలు సాధారణంగా విస్తృత పరిధిలో సంచరిస్తాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Police Arrests | పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్టు..