అక్షరటుడే, వెబ్డెస్క్: Bhutan glacier outburst | నేపాల్ Nepal లో సంభవించిన మెరుపు వరదల మంటలు ఆరకముందే, మరో హిమాలయ దేశంలో ప్రకృతి మరోసారి తన ప్రతాపం చూపింది. వాయవ్య భూటాన్లోని గాసా జిల్లాలో ఉన్న ‘షింటాపు’ హిమానీనద సరస్సు ఒక్కసారిగా విస్ఫోటం చెందింది.
ఉప్పొందిన సరస్సు నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలపైకి పోటెత్తడంతో మహా ప్రళయం సృష్టించింది. ఈ విలయంతో భారత్లోని సరిహద్దు రాష్ట్రాలకు భారీ ముప్పు పొంచివున్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Bhutan glacier outburst | కొట్టుకుపోయిన హాట్ స్ప్రింగ్స్..
గాసా జిల్లాలోని మో చు నది పరివాహక ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ‘గాసా త్చాచు’ వేడినీటి బుగ్గ (హాట్ స్ప్రింగ్) ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. అక్కడ ఉన్న యాత్రికుల వసతి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లన్నీ నీటి ప్రవాధాటికి క్షణాల వ్యవధిలో కొట్టుకుపోయాయి.
అయితే, ముందస్తు సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై ఆ ప్రాంతంలోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
Bhutan glacier outburst | భారతదేశానికి ముప్పు పొంచివున్న ప్రాంతాలు ఇవే..
ప్రస్తుతం ఈ ప్రళయ వరద నీరు ఉధృతంగా దిగువ ప్రాంతాల వైపు పరుగులు తీస్తోంది. ఇప్పటికే శ్రీగాంగ్ ప్రాంతాన్ని దాటిన ఈ వరద ఉధృతి, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వణికిస్తోంది.
అస్సాం: ధుబ్రి జిల్లాతో పాటు పలు లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచివుంది.
పశ్చిమ బెంగాల్: డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, అలీపురదువార్, జల్పాయిగురి జిల్లాలను భూటాన్ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసింది.
కూచ్బెహార్: సకోశ్ నది పరివాహక ప్రాంత ప్రజలను స్థానిక యంత్రాంగం అప్రమత్తం చేసింది. నదీ తీరానికి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Bhutan glacier outburst | ప్రమాదపు అంచున హిమాలయాలు!
హిమాలయ పర్వత ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైనగా గుర్తించిన 17 గ్లేసియల్ (హిమానీనద) సరస్సుల్లో ఈ ‘షింటాపు’ సరస్సు కూడా ఒకటి కావడం గమనార్హం. మో చు నది ఉద్భవించే ప్రాంతం ఇదే కావడంతో ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా, 2021లోనే మో చు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల అప్పట్లోనూ గాసా త్చాచు ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది.
ప్రస్తుతం ఈ మెరుపు వరదల నేపథ్యంలో అస్సాం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, సహాయక చర్యలను సిద్ధం చేశాయి. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.